
అనుమానిస్తున్నాడని.. కడతేర్చారు
● వ్యక్తి హత్య కేసులో అత్తామామ, భార్య అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు
మహబూబాబాద్ రూరల్ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను అనుమానిస్తున్నాడని భర్తను అత్తామామ, భార్య కలిసి కడతేర్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో చోటుచేసుకుంది. ఈ హత్య కేసు వివరాలను మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు సోమవారం రూరల్ పీఎస్‌లో వెల్లడించారు. తండాకు చెందిన బానోత్ వీరన్న కూతురు మౌనికను తొమ్మిది సంవత్సరాల క్రితం బల్హార్ష ప్రాంతానికి చెందిన లకావత్ బాలకు ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు ఉండగా, 5 సంవత్సరాల నుంచి దంపతులు హైదరాబాద్‌లో పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మౌనిక వివాహేతర సంబంధ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఇదే విషయమై ఈ నెల 17వ తేదీన బాల, అతడి అన్న లకావత్ బావుసింగ్ ధర్మారం తండాకు వెళ్లి మౌనికతో గొడవ పెట్టుకున్నారు. అంతలోనే భార్య మౌనిక, మామ వీరన్న, అత్త కై ల కలిసి బాల, బావుసింగ్ కళ్లలో కారం చల్లారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. కొద్ది సమయం తర్వాత బాల తన అత్తగారింటికి వెళ్లి తమను చంపాలని చూస్తారా అని గొడవ పెట్టుకున్నాడు. ఆ వెంటనే అతడి భార్య మౌనిక, అత్త కై ల కొట్టగా మామ వీరన్న కత్తితో చాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాలను 108లో మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అదే రాత్రి 10 గంటలకు మృతిచెందాడు. ఈ ఘటనలో అత్తామామ వీరన్న, కై ల, భార్య మౌనికను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.