
కమిషనరేట్‌లో ఏసీపీల బదిలీ
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏసీపీ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్‌కుమార్.. డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం సీసీఆర్‌బీ ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా పనిచేసిన పి.ప్రశాంత్‌రెడ్డిని కాజీపేట ఏసీపీగా, మామునూరు ఏసీపీగా పనిచేస్తున్న బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్‌బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ బదిలీపై వచ్చారు. రాచకొండ ‘షీ’ టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీగా పనిచేస్తున్న కొత్త దేవేందర్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఇప్పటికే బదిలీ అయిన స్థానాల్లో పలువురు ఏసీపీలు రిపోర్టు చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన కిరణ్‌కుమార్ సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పి.ప్రశాంత్‌రెడ్డి కాజీపేట ఏసీపీగా, నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వెలువడిన ఉత్తర్వుల్లో సీసీఎస్ ఏసీపీగా పి.సదయ్య బదిలీ అయినట్లు ఉండడం గందరగోళానికి తావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలీఉల్లాఖాద్రీ
కేయూ క్యాంపస్: అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్ వలీ ఉల్లాఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతిలో నాలుగురోజులుగా నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో వలీఉల్లాఖాద్రీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వలీఉల్లాఖాద్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. కేయూ వేదికగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏఐఎస్‌ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా దేశం వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వలీఉల్లాఖాద్రీ కేయూలో కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు.