
చిన్న కాళేశ్వరం పనుల అడ్డగింత
కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కాటారం శివారులోని 501లో కొనసాగుతున్న కాల్వ నిర్మాణ సర్వే పనులను భూ నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే ఊరుకునేది లేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రికార్డుల్లో నష్టపరిహారం అందినట్లు ఉందని నిబంధనల ప్రకారం తాము పనులు చేపడుతామని సర్వే, ఇరిగేషన్ అధికారులు రైతులకు తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి పరిహారం అందలేదని, పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అధికారులు నిర్వాసిత రైతులకు స్పష్టం చేశారు. పనులు అడ్డుకున్న వారిలో రైతులు దుర్గం తిరుపతి, సాంబమూర్తి, తదితరులు ఉన్నారు.