
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీతో మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. మేడారం పరిసరాలు భక్తులతో సందడిగా కనిపించాయి. మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, గాజులు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలు, కోళ్లతో మొక్కు సమర్పించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహాపంక్తి భోజనాలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచన వేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ గద్దెల ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా మైకు అనౌన్స్‌మెంట్ ద్వారా భక్తులను అప్రమత్తం చేశారు.
కాళేశ్వరం టు మేడారం
మేడారానికి వచ్చిన భక్తులు.. కాళేశ్వరానికి వెళ్లడం.. అక్కడకు వెళ్లిన భక్తులు ఇక్కడకు వస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మేడారానికి వచ్చిన భక్తులను పలకరించగా అమ్మవార్లను దర్శించుకుని కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తామని చెప్పారు. కొందరు భక్తులు కాళేశ్వరం సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించి మేడారానికి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చినట్లు సాక్షికి తెలిపారు. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆదివారం మేడారంలో మినీ జాతర కళ సంతరించుకుంది.
భారీగా తరలివచ్చిన భక్తులు
సరస్వతి పుష్కరాల నేపథ్యంలో
పెరిగిన భక్తుల సంఖ్య

మేడారంలో భక్తుల కోలాహలం