
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాలకు నేడు(ఆదివారం) భక్తులు కాళేశ్వరం అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఆరోగ్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. శని వారం వచ్చిన వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అలాంటి సమస్య రాకుండా పకడ్బందీ గా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించా రు. తెల్ల వారుజాము నుంచే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు వారికి కేటా యించిన విధుల్లో నిమగ్నం కావాలన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో 10వేల మంది తరలింపు
భూపాలపల్లి అర్బన్: సరస్వతి పుష్కరాల్లో భాగంగా మూడో రోజు శనివారం వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి 183 ఆర్టీసీ బస్సుల్లో 10,500మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి సాయంత్రం 6గంటల వరకు 170 బస్సులో 7,500మంది తిరిగి వెళ్లినట్లు తెలిపారు.
మూడో రోజు అన్నదానం
భూపాలపల్లి రూరల్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ వద్ద జాతీయ రహదారి పక్కన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో మూడోరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భక్తులకు భోజనం వడ్డించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మాజీ సర్పంచ్ తోట సంతోష్, భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ సిరుప అనిల్, అప్పం కిషన్, తోట రంజిత్, మహేందర్, చరణ్, కోటి, హఫీజ్, సాయితేజ పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఐదు పాడిగేదెల మృతి
భూపాలపల్లి రూరల్: విద్యుదాఘాతంతో ఐదు పాడిగేదెలు మృతి చెందిన ఘటన శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్‌గడ్డలో చోటుచేసుకొంది. గ్రామస్తులు, కాపరి సాగర్ల సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్‌గడ్డకు చెందిన కొడారి ఓదెలుకు, బోయిని రమేష్‌కు చెందిన గేదెలను గ్రామ శివారు పొలాల్లోకి మేతకు తీసుకువెళ్లాడు శుక్రవారం కురిసిన వర్షానికి 11 కేవీ లైన్‌విద్యుత్ తీగలు తెగి పొలాల్లో పడి ఉన్నాయి. కొడారి ఓదెలుకు చెందిన నాలుగు గేదెలు, బోయిని రమేష్‌కు చెందిన ఒక గేదె తీగలకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాయి. దీంతో అప్రమత్తమైన కాపరి మిగతా గేదెలను అటు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాడి వృత్తినే జీవనోపాధిగా జీవించే బాధిత కుటుంబాల సభ్యులు మృతిచెందిన గేదెల వద్ద రోదించిన తీరు పలువురికి కన్నీరు తెప్పించింది. మృతిచెందిన గేదెల విలువ రూ.4.50లక్షలు ఉంటుందని, ప్రభుత్వం విద్యుత్‌శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
టోల్ వసూళ్ల నిలిపివేత
కాటారం: కాళేశ్వరం వచ్చే వాహనాలకు గ్రామపంచాయతీ టెండర్ ద్వారా వసూలు చేస్తున్న టోల్ ఫీజును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం తెలిపారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో శనివారం నుంచి భక్తుల వాహనాల రాక విపరీతంగా పెరిగిపోయింది. కాళేశ్వరం ప్రారంభంలోని ముక్తివనం వద్ద టెండర్‌దారులు వాహనాలను నిలిపి టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ వాహనాలను నిలిపి టోల్‌ఫీజు వసూలు చేయవద్దని టెండర్‌దారులను ఆదేశించారు. వాహనదారులు టోల్‌ఫీజు చెల్లించవద్దని సూచించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి