
హామీలు నెరవేరుస్తున్నాం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హమీలను నెరవేరుస్తున్నామని కనీస వేతనాల సలహా సభ్యులు, ఐఎన్‌టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎస్.నర్సింహరెడ్డి తెలిపారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల హమీలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఐఎన్‌టీయూసీ భవనంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అన్ని ఏరియాల ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న క్లరికల్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసి, కారుణ్య నియామకాల వయో పరిమితిని 35నుంచి 40ఏళ్లకు పెంచినట్లు చెప్పారు. నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు. ఒడిశాలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, బొగ్గు గనులను సింగరేణికే కేటాయించే విధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిని కలిసినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు రాజేందర్, బుచ్చయ్య, సమ్మిరెడ్డి, వేణు పాల్గొన్నారు.