
కార్మికవర్గానికి జాతీయ సంఘాల ద్రోహం
భూపాలపల్లి అర్బన్: జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా 40కోట్ల మంది కార్మికవర్గానికి ద్రోహం చేశాయని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో 14 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. పాకిస్తాన్–భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సమ్మెను వాయిదా వేస్తున్నామని ప్రకటించాయన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి హామీ తీసుకోకుండా జాతీయ సంఘాలు సమ్మెను ఎలా వాయిదా వేస్తాయని ఆరోపించారు. జాతీయ కార్మిక సంఘాలు బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కుమారస్వామి, రాజన్న, జనార్దన్, ప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.