
యునెస్కో ఆదేశాలు బేఖాతర్!
● రామప్ప ఆలయానికి సిమెంట్ కాంక్రీట్‌తో మరమ్మతులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చినప్పటికీ పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయాన్ని కేవలం ఇసుకనే పునాదిగా చేసి రాళ్లను పేర్చి ఆలయాన్ని నిర్మించారు. రామప్ప ఆలయ గోపురాన్ని సైతం నీటిలో తేలాడే ఇటుకలతో నిర్మించారు. యునెస్కో గుర్తింపు ఇచ్చే సమయంలో సాండ్ బాక్స్ టెక్నాలజీ, ఒకే రాతిలో రెండు రంగులు, పురాతన కట్టడాన్ని పరిగణలోకి తీసుకొని యునెస్కో గుర్తింపు ప్రకటించింది. యునెస్కో గుర్తింపు వచ్చాక సిమెంటు కాంక్రీట్‌తో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆలయానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టాలన్నా సున్నం, ఇటుక పొడి, కరక్కాయ, బెల్లం, ఇసుకను ఉపయోగించి మిశ్రమంగా తయారు చేసి మరమ్మతులు చేపట్టాలి. రామప్ప ఆలయం వర్షానికి కురిసినపుడు పైకప్పుకు సైతం ఇదే విధంగా మిశ్రమాన్ని తయారు చేసి మరమ్మతులు చేపట్టారు. రామప్ప ఆలయం చుట్టూ ఏర్పడిన సందులను (గ్యాప్‌ను) రెండు రోజులుగా సిమెంట్ కాంక్రీటుతో పనులు చేపడుతున్నారు. పురావస్తుశాఖ చేపట్టే పనులతో గుర్తింపునకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంటుందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు.