మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఉదయాన్నే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలలో హేమాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంతంలోని చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. సంతాన ప్రాప్తికి వచ్చిన దంపతులకు ఆలయ పూజారులు నాభిచందన ప్రసాదం అందజేశారు.