సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

ప్రజావాణిలో 232 దరఖాస్తుల స్వీకరణ

జనగామ రూరల్‌: ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజల నుంచి 232 అర్జీలు తీసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉన్నవి గుర్తించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులు కొన్ని ఇలా..

● సంజయ్‌ నగర్‌కు చెందిన ఆర్‌.సరిత, 16వ వార్డులో పది సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నారని, తమకు ఎటువంటి ఇల్లు లేదని, ఖాళీ స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటికి వచ్చి ధ్రువీకరించారని, ఎల్‌1 జాబితాలో ఉండగా తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు.

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన గీతాదేవి రాథోడ్‌, 2019వ సంవత్సరంలో 623.25 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేయగా, ఇప్పుడు తమ కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మకానికి చూడగా హౌస్‌ సైట్స్‌ అని చూపిస్తోందని, రిజిస్ట్రేషన్‌ కావడం లేదని విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.

● జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రంగు సారంగపాణి, కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లు పైబడిన అందిస్తున్న రూ.2000 పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, పింఛన్‌ అందించి ఆదుకోవాలని కోరారు.

● నర్మెటలో మూడు సంవత్సరాలుగా గ్రామ కార్యదర్శిగా శ్రీధర్‌ అనే వ్యక్తి సొంతూరులోనే విధులు నిర్వహిస్తున్నారని, పంచాయతీరాజ్‌ శాఖ నిబంధనల ప్రకారం అది సరికాదని, ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని నర్మెటకు చెందిన పులి రేణుక వినతి పత్రం అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement