● ఎండిపోయే దశలో ఉన్న వరి పంటకు ఊపిరి
లింగాలఘణపురం: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి ఇటీవల ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో తిరిగి మళ్లీ కాలువల్లోకి నీరు చేరింది. దీంతో పొట్టకొచ్చి ఎండిపోయే దశలో ఉన్న వరికి జీవం పోసినట్‌లైంది. ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పొట్టకొచ్చిన పంట ఎండిపోతుంది సారూ’.. అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. అంతేకాకుండా వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి ఏప్రిల్ రెండో వారం వరకు నీటిని విడుదల చేయాలని నివేదిక అందించారు. ఎమ్మెల్యే కడియం సంబంధిత నీటిపారుదల శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో 16 ఎల్ నుంచి నీరు నెల్లుట్ల, పటేల్‌గూడెం, లింగాలఘణపురం రైతుల పొలాలకు చేరుతోంది. దీంతో సుమారు వంద నుంచి 150 ఎకరాల పంటకు మేలు చేకూరనుంది. నీటి విడుదలకు సహకరించి పంటలు కాపాడేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియంకు, ఏఈ కిషోర్‌కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.


