లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే | - | Sakshi
Sakshi News home page

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే

Dec 18 2025 7:55 AM | Updated on Dec 18 2025 7:55 AM

లాస్ట

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే

మూడో విడతలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల పోటాపోటీ

సర్పంచుల ప్రమాణ స్వీకారం 22వ తేదీకి వాయిదా

పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఫలితాలు

మరిన్ని ఎన్నికల వార్తలు 8లో సర్పంచ్‌ విజేతలు వీరే 9లో

మూడు విడతల ఎలక్షన్లు పరిసమాప్తి

మూడో విడతలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల పోటాపోటీ

జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది. మూడు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 108 వార్డులు, మూడు సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవంగా, 88 సర్పంచ్‌, 692 వార్డు స్థానాల్లో పోటీ నెలకొంది. బుధవారం జరిగిన పోలింగ్‌ అనం తరం మధ్యాహ్నం ప్రారంభమైన లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించింది. ఏకగ్రీవాలను కలుపుకొని కాంగ్రెస్‌ 49 స్థానాలు తెచ్చుకోగా, బీఆర్‌ఎస్‌ 38 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ రెబల్స్‌గా పోటీ చేసిన నలుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పై చేయిగా నిలువగా, మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభావంతో బీఆర్‌ఎస్‌ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇరు పార్టీల ప్రచార బృందాలు గ్రామాల వారీగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తివంచన లేకుండా శ్రమించాయి.

మండలాల వారీగా

పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొడకండ్ల మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్‌ 16 స్థానాలు గెలుచుకుంది. ఒక చోట కాంగ్రెస్‌ రెబల్‌ విజయం సాధించగా, నాలుగు చోట్ల బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. దేవరుప్పుల మండల పరిధిలో 32 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్‌ 14, ఒక స్వతంత్ర స్థానాన్ని కై వసం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 17 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. పాలకుర్తి మండల పరిధిలో కాంగ్రెస్‌ 19, కాంగ్రెస్‌ రెబల్స్‌ ఇద్దరు, బీఆర్‌ఎస్‌ 16 స్థానాల్లో గెలు పొంది అధికార పార్టీకి జలక్‌ పుట్టించింది. ప్రధాన పోరు పూర్తిగా కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య నడవగా, ఇతర పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల్లో అగ్రశ్రేణి ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ, ఈసారి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రెండు పార్టీలు పోటీపడటం విశేషం. పాలకుర్తి ప్రాంతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ బలం ఇప్పటికీ నిలకడగా ఉన్నదనే సంకేతాలు ఫలితాలు ఇస్తున్నాయి.

ఎవరికి వారే..

ప్రచార సమయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి తమ ఆధిక్యానికి కారణమని కాంగ్రెస్‌ స్థానిక నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఝాన్సీరెడ్డి నేతృత్వంలో గ్రామాల వారీగా విస్త్రత ప్రచారం చేశారు.

బలబలాలు..

పాలకుర్తి మూడో విడత ఎన్నికల ఉత్కంఠను మరింత పెంచాయి. కాంగ్రెస్‌ 49, బీఆర్‌ఎస్‌ 38 స్థానాలు గెలుచుకొని ఏ మాత్రం తమ బలం తగ్గలేదని నిరూపించుకున్నాయి. పాలకుర్తి ప్రజలు రెండూ ప్రధాన పార్టీలకు సమాన గౌరవం ఇస్తూ తమ నిర్ణయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.

కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 20వ తేదీన శుభ ముహూర్తాలు లేవన్న మెజార్టీ సర్పంచుల అభిప్రాయం మేరకు ప్రమాణ స్వీకార తేదీని మార్చారు. సర్పంచులు, వార్డు సభ్యులు 22వ తేదీ ఉదయం నిర్ణయించిన సమయాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ ప్రాంగణాలను శుభ్రపరచడం, పండుగ వాతావరణం నెలకొనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాభివృద్ధికి కొత్త సంకల్పాలతో ముందుకు సాగుతామని పలువురు సర్పంచులు పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ 49, బీఆర్‌ఎస్‌ 38

స్థానాల్లో జయకేతనం

పాలకుర్తి, దేవరుప్పలలో రెండు పార్టీలకు సమాన స్థానాలు

కొడకండ్లలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి ఆధిక్యం

మూడు విడతల్లో కాంగ్రెస్‌–148..

బీఆర్‌ఎస్‌ 105

మండలం జీపీ కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ స్వతంత్రులు

పాలకుర్తి 38 19 17 02

దేవరుప్పుల 32 14 17 01

కొడకండ్ల 21 16 04 01

మొత్తం 91 49 38 04

మొదటి విడతలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయకత్వంలో కాంగ్రెస్‌ 69 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 27 స్థానాలు సాధించగా పూర్తి ఆధిపత్యం కనబర్చగా, 10 చోట్ల స్వతంత్రులు పైచేయి సాధించారు. రెండో విడ తలో జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. 40 స్థానాల్లో గులాబీ దళం పరుగులు పెట్టగా, కాంగ్రెస్‌ 30 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలో మూడు విడతలుగా పరిశీలిస్తే కాంగ్రెస్‌ 148 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 105 స్థానాలు కై వసం చేసుకోగా బీజేపీ కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఇంకా గెలుపొందిన వారీగా స్వతంత్రులు 23 మంది ఉన్నారు.

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే1
1/2

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే2
2/2

లాస్ట్‌ పంచ్‌ ..కాంగ్రెస్‌దే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement