కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు జాప్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోం ఆదేశించారు. మండలంలోని కోమళ్ల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీ లించి ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ..అని అడిగి కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు పంపించాలని ఆయన ఆదేశించారు.
దేవరుప్పుల: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎవరూ విఘాతం కలిగించినా కఠిన చర్యలు అనివార్యమని జనగామ డీసీపీ రాజామహేంద్రనాయక్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారితోపాటు పలు సమస్యాత్మక గ్రామాలైన సింగరాజుపల్లి, సీతారాంపురం, చిన్నమడూరు, కడవెండి, కోలుకొండ, మాధాపురం తదితర గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు వర్ధన్నపేట టేసీపీ అంబటి నర్సయ్య పర్యవేక్షణలో సీఐలు సత్యనారాయణ, అబ్బయ్య, సుజాత, 18మంది ఎస్సైలు, 8 మంది ఏఏస్సైలు, 28 హెడ్‌కానిస్టేబుళ్లు, 145 కానిస్టేబుళ్లు తమ విధులు నిర్వర్తిస్తున్నట్టు వివరించారు.
బచ్చన్నపేట: దళితులమని తమను చిన్నచూపు చూస్తున్నారని మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని దళితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ మాజీ సర్పంచ్ భర్త ఎన్నికల ముందు దళితులమని చిన్నచూపుతో దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలమనే అహంకారంతో తమను చిన్నచూపు చూడడం తగదన్నారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్ ఇంటికి వెళ్తే తన కాళ్లు మొక్కడానికి వచ్చారా అని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చేప్పే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్ గ్రామానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై హమీద్‌కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినల్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలన
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో11వ రాష్ట్రస్థాయి బాలుర స్పోర్ట్స్ మీట్ ఈ నెల 18 నుంచి 20 వరకు జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలురు)లో జరగనుంది. ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించిన ప్లేగ్రౌండ్, వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, భద్రత తదితర ఏర్పాట్లను మల్టీజోన్–1 అధికారి హెచ్.అరుణకుమారి మంగళవారం పరిశీలించారు. నిర్వహణ ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సమిష్టి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎ.నరసింహులు గౌడ్, రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాస్, కిషన్, వెంకట్‌రెడ్డి, లింగనాయక్, రమేశ్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి
కొనుగోళ్లు వెంటనే పూర్తిచేయాలి


