ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి వాయిదా
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక మూడోసారి సైతం వాయిదా పడింది. సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో ఈనెల 12న ఉపసర్పంచ్ ఎన్నిక అనివార్యకారణాలతో వాయిదా పడింది. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 15న ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఆర్‌ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. కాగా నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి ఉపసర్పంచ్ ఎన్నిక చేసే లక్ష్యంగా స్వయంగా ఎంపీడీఓ నర్సింగరావు మంగళవారం ఇప్పగూడెం గ్రామపంచాయతీకి చేరుకున్నారు. అయినప్పటికీ మధ్యాహ్నం 1 గంట వరకు సైతం వార్డు సభ్యులెవ్వరూ పంచాయతీ కార్యాలయానికి రాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. కాగా ఈనెల 18న చివరి అవకాశం ఇస్తున్నామని, అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ, కారోబార్ శ్రీను తదితరులు ఉన్నారు.
వార్డుమెంబర్ల మధ్య కుదరని సయోధ్య
ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక వరుసగా మూడుసార్లు వాయిదాపడడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యుల్లో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుపడుతున్నారు. సీపీఎం శ్రేణులు రెండు వర్గాలుగా మారి ఉపసర్పంచ్ పదవికి పోటీపడుతుండగా సయోధ్య కుదరడం లేదు. ఏది ఏమైనా ఈనెల 18న ఉపసర్పంచ్ ఎన్నికకు తెరపడనున్నట్లు సమాచారం.


