నేడే తుది పోరు
జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మూడు మండలాల పరిధిలో ఈనెల 17న(బుధవారం) పోలింగ్ జరగనుంది. భద్రత, నిఘా కట్టుదిట్టం చేయగా, సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు తరలివస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అత్యధిక స్థానాలపై నజర్ పెట్టడంతో రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
సర్పంచ్ బరిలో 88 మంది..
పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 91 గ్రామ పంచాయతీలు, 800వార్డులు ఉండగా, వీటిలో మూడు జీపీలు, 108 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవం కాకుండా మిగిలిన 91 జీపీల పరిధిలో 88 మంది సర్పంచులు, 692 వార్డుల్లో 1,524 మంది సభ్యులు బరిలో నిలిచారు. పోలింగ్ నిర్వహణ కోసం 800 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 960 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,222 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ నేపథ్యంలో మూడు మండలాల పరిధిలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు అధికారులు 51 బస్సులను సిద్ధం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 1,18,870 ఓట్లు ఉండగా, ఇందులో పురుష ఓటర్లు 59,001, మహిళా ఓటర్లు 59,866, ఇతరులు ముగ్గురు ఉన్నారు.
అమలులో 144 సెక్షన్
భద్రత పరంగా మూడు మండలాల్లో 35 క్రిటికల్ గ్రామాలను గుర్తించి, 40 రూట్లలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలు, క్రమశిక్షణ, ప్రశాంతతను కాపాడేందుకు మూడో దశ ఎన్నికల ప్రాంతాల్లో డీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా తెలిపారు. పోలింగ్ మరుసటి రోజు 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు లేదా లెక్కింపు పూర్తై ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు మూడు మండలాల పరిధిలో ఈ నిషేధాజ్ఞలు(144 సెక్షన్) కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఉదయం 7 గంటల నుంచి..
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్న విరామం అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగించి, సాయంత్రం 4 గంటలకు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. చివరి పోరు గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో రెండు విడతల పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, మూడో విడత పోలింగ్ పాలకుర్తి నియోజకవర్గంలో జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సాగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు పాలకుర్తితోనే ముగింపు పలుకనుంది. చివరి దశ కావడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొనగా, అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. పోలింగ్ పూర్తయ్యాక జిల్లా మొత్తంలో గ్రామ పాలనకు సంబంధించి కొత్త ప్రజాప్రతినిధుల రూపకల్పన పూర్తవనుండగా, ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం
కట్టుదిట్టమైన బందోబస్తు
మూడు మండలాల్లో హైటెన్షన్
ఓ వైపు ఎమ్మెల్యే యశస్విని..
మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి
సర్పంచ్ బరిలో 88మంది అభ్యర్థులు.. వార్డు మెంబర్ల స్థానాలకు 1,524 మంది
డీసీపీతో కలిసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడతలో జరగనున్న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గ్రామపంచాయితీ మూడో విడత ఎన్నికల సందర్భంగా పాలకూర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎలక్షన్ అబ్జర్వర్ కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన ఆయా గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్‌లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
నేడే తుది పోరు
నేడే తుది పోరు
నేడే తుది పోరు
నేడే తుది పోరు


