ముహూర్తం ఖరారు
● ఈ నెల20న గ్రామ పంచాయతీ పాలక మండళ్ల ప్రమాణం
● అదే రోజు తొలి సమావేశం
● కొత్త సర్పంచ్‌లపై పారదర్శక పాలన.. గ్రామాల అఽభివృద్ధి బాధ్యత
జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న నూతన పాలకవర్గాలకు సంబంధించిన తొలి సమావేశ తేదీ ఖరారైంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్‌న్ విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీన పంచాయతీల మొదటి సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మ ంగళవారం వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈనెల 17లోపు మూడో విడతలో ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకు తొలి సమావేశ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సమావేశాలతో గ్రామస్థాయిలో కొత్త పాలకవర్గాల పాలన అధికారికంగా ప్రారంభం కానుంది.
20న సర్పంచుల ప్రమాణ స్వీకారం..
ఈ నెల20వ తేదీన జరగనున్న తొలి సమావేశంలో సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజల నమ్మకంతో ఎన్నికై న ప్రతినిధులు ఇకపై గ్రామ అభివృద్ధికి నాయకత్వం వహించాల్సిన కీలక దశ ఇది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తొలి అడుగు పడనుంది. నూతన పాలకమండళ్లు ముందుగా గ్రామ అవసరాలను గుర్తించి స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామపంచాయతీ నిధులు, ప్రభుత్వ పథకాలు, ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోవడం కీలకం.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన
గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రజల అభిప్రాయాలను నిర్ణయాల్లో భాగం చేయడం ద్వారా పారదర్శక పాలన సాధ్యమవుతుంది. అవినీతి, వివక్షలకు తావులేకుండా సమాన న్యాయం అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం సాకారం అవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
శుభముహూర్తాల వేటలో
జిల్లాలోని 280మంది సర్పంచ్‌లు, 2,534మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కీలక ఘట్టాన్ని శుభప్రదంగా ప్రారంభించాలనే సంకల్పంతో సర్పంచులు, వార్డు సభ్యులు వేద పండితులను ఆశ్రయిస్తూ శుభ ముహూర్తాలపై ఆరా తీ స్తున్నారు. ప్రమాణ స్వీకారం ఏ సమయంలో చేయాలి, ఆ రోజు అనుకూలమా అనే అంశాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయంలో చాంబర్‌లో ఏ దిశగా కూర్చోవాలి, వాస్తుపరంగా ఏమైనా సరిదిద్దుకోవాలా అనే విషయాలపై కూడా సలహాలు తీసుకుంటున్నారు. రాబోయే ఐదేళ్లు ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో సాగాలన్న ఆకాంక్షతో ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.


