ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
పాలకుర్తి టౌన్: మూడో విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో డిస్ట్రిబ్యూటరీ కేంద్రాన్ని డీసీపీ రాజామహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గొడవలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాలయేసులో ఏర్పాట్లు బాగున్నాయి..
దేవరుప్పుల: మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సామగ్రి పంపిణీతో పాటు అధికారుల కేటాయింపు కోసం మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కలెక్టర్ సహ సిబ్బంది కొనియాడారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించిన సమయంలో పోలీసులకు తీసిపోకుండా ఎన్‌సీసీ విద్యార్థుల సర్వీసు, పార్కింగ్, భోజన తదితర వసతులు చూసి ముగ్ధులయ్యారు. వెంటనే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక ఏర్పాట్ల తీరుపై ఓ డాక్యుమెంటరీ తీసి ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నట్టు సమాచారం. కాగా విధులకు వచ్చిన పలువురిని కదిలించగా ఇటీవల రెండు విడతల్లో ఎక్కడా ఇలాంటి ఏర్పాట్లు చూడలేదని కితాబు ఇవ్వడం గమనార్హం.
డిస్టిబ్యూషన్ సెంటర్ పరిశీలన
కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.


