చేతులెత్తేశారు..
జనగామ: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి రవాణా లేక, సమయానికి భోజనం అందక, వీల్‌ఛైర్ సేవలు కరువై అధికారులు, ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బచ్చన్నపేట బూత్‌లో వృద్ధ మహిళ జారి పడగా, ఏర్పాట్లలో లోపాలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మొదటి విడత పోలింగ్ సమయంలో స్టేషనన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని చిల్పూరు మండలంలో పోలింగ్ విధులు నిర్వహించిన పీఓలు, ఓపీఓలు సహా ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు తిరుగు ప్రయాణం కోసం అధికారులు, సిబ్బంది మండల కేంద్రానికి చేరుకున్నారు. అయితే, అక్కడి నుంచి జనగామకు రవాణా సౌకర్యంలేదని మండల అధికారులు చేతులెత్తేశారు. కూర్చునే వీలులేని దయనీయ స్థితిలో ఎలక్షన్ అధికారులు రోడ్డుపైనే నిలబడి పోయారు. ఈ విషయమై స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందులో కొందరు అధికారులు జనగామ సాక్షి దృష్టికి తీసుకు రాగా, వెంటనే జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించగా, ఆయన ఆదేశాల మేరకు అర్ధరాత్రి ఒంటిగంటకు ఓ బస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశించినప్పటికీ, స్టేషన్ ఘన్‌పూర్ వరకే తీసుకెళ్తామని చెప్పడంతో సిబ్బంది మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనగామ వరకు తీసుకొచ్చారు.
కొడకండ్లలో తీవ్ర నిర్లక్ష్యం
మూడవ విడతలో పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో విధులు నిర్వర్తించిన సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి తాగునీరు, టీ, భోజనం వంటి సౌకర్యాలు లేక రాత్రి 11.30 గంటల వరకు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ, వెంటనే కలెక్టర్ రావాలని బూత్ ప్రాంగణంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉండడంతో జీపీ చెత్త సేకరణ ట్రాక్టర్‌లో ఓ సంచిలో అన్నం ప్యాకెట్లను వేసుకుని తీసుకొచ్చారు. ఇలాంటి వాటిలో ఎలా తినాలి, మధ్యాహ్నం నుంచి కడుపు మండిపోతోంది, షుగర్, బీపీలాంటి సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, ఇదేనా ఎన్నికల్లో సిబ్బందిపై శ్రద్ధ అంటూ మండిపడ్డారు. కాగా జనగామలో రిజర్వులో ఉన్న పలువురు ఎలక్షన్ అధికారులకు రూ.1,500 ఇవ్వాల్సి ఉండగా, రూ.1,000తో సరిపెట్టే సమయంలో సదురు అధికారిని నిలదీయడం, పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అక్కడకు రావడంతో మిగతా డబ్బులు ఇవ్వడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది. పోలింగ్ విధులు నిర్వర్తించే పీఓ, ఓపీఓ, ఇతర సిబ్బంది ఇంతటి స్థాయిలో ఇబ్బంది పడేలా చేసే ఎలక్షన్ అధికార గణం.. విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసుల పేరిట హెచ్చరిడం భావ్యం కాదని వాపోతున్నారు. ఎన్నికలు మూడు విడతలుగా విజయవంతంగా ముగిశాయి. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో రవాణా, భోజనం, విశ్రాంతి వంటి ప్రాథమిక సదుపాయాల్లో లోపాలు వెలుగుచూశాయి.
పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు
కల్పించడంలో అధికారుల విఫలం
మూడు విడతల్లో తప్పని తిప్పలు
అర్ధరాత్రి రవాణా సౌకర్యం
కల్పించకపోవడంతో ఇక్కట్లు
సరైన భోజనం పెట్టకపోవడంతో పస్తులు


