తరలొచ్చారు!
● మూడో విడత పంచాయతీ పోరులో
88.48 శాతం పోలింగ్ నమోదు
● మహిళ–పురుష ఓటర్ల సమాన స్పందన
● జిల్లాలో మూడు విడతల్లో
కలిపి 88.90శాతం ఓటింగ్
జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సమయానికి మూడు మండలాల పరిధిలో 88.48శాతం నమోదైంది. దేవరుప్పుల మండలం 90.10శాతంతో అగ్రస్థానంలో నిలవగా, పాలకుర్తి మండలంలో 88.19శాతం, కొడకండ్లలో 86.29శాతం ఓటింగ్‌తో గ్రామీణ ఓటర్ల ప్రజాస్వామ్య చైతన్యానికి నిలువుటద్దంలా నిలిచారు. మూడు మండలాల్లో మొత్తం 1,17,381 మంది ఓటర్లలో 89శాతానికి చేరువగా ఓటింగ్ నమోదై స్టేషన్‌ఘన్‌పూర్ తర్వాత రెండో స్థానం దక్కించుకుంది. జిల్లాలో మూడు విడతల్లో కలిపి 88.90శాతం పోలింగ్ నమోదైంది.
గంట గంటకూ పెరిగిన శాతం
మూడు మండలాల పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓటర్ల రద్దీ కనిపించింది. ఉదయం 9 గంటల ట్రెండ్ చూస్తే మూడు మండలాల్లో కలిపి 25.01 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రారంభ సమయంలో దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఓటర్లు పెద్దఎత్తున తరలిరాగా, కొడకండ్లలో మాత్రం కాస్తా వేగంగా పుంజుకుని ఉదయం 11 గంటల కల్లా ఓటింగ్ శాతం రెట్టింపు పెరిగింది. అప్పటి వరకు మూడు మండలాల్లో కలిపి 51.82 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ ముగిసే సమయం మధ్యాహ్నం 1 గంటకు 83.27 శాతం ఓట్లు పోలు కాగా, చివరికి సాయంత్రం ముగిసే సమయానికి మొత్తం కలిపి 88.48 శాతం ఓటింగ్ వద్ద ముగిసింది.
మండలాల వారీగా..
దేవరుప్పుల మండలంలో ఉదయం నుంచి పెరిగిన ఓటర్ల వేగం మధ్యాహ్నానికి గరిష్ఠ స్థాయికి చేరింది. చివరికి 90.10శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అత్యధిక రికార్డు ఇదే. కొడకండ్ల మండలంలో ఆరంభంలో మందగించిన పోలింగ్ 11 గంటల తర్వాత ఊపందుకుంది. పాలకుర్తి మండలంలో 88.19శాతం ఓట్లు నమోదయ్యాయి.
మూడు విడతల్లో 88.90శాతం ఓటింగ్
మొదటి విడత స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 89.71 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మూడు నియోజకవర్గాల పరిధిలో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.రెండో విడతలో జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 88.52 శాతం పోలింగ్ జరిగింది. ఇది ఇతర నియోజకవర్గాల కంటే కొద్దిగా తక్కువైనా, జిల్లాలో మంచి స్థాయి ఓటింగ్‌గా పరిగణించవచ్చు. మూడో విడతలో పాలకుర్తి నియోజకవర్గంలో 88.44శాతం పోలింగ్ నమోదు కాగా, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ శాతంతో పోలిస్తే, స్వల్పంగా తక్కువ. మూడు నియోజకవర్గాల పోలింగ్‌ను కలిపి పరిశీలిస్తే 88.90 శాతం రావడం ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
తరలొచ్చారు!
తరలొచ్చారు!


