నోట్ల వర్షం కురిపించినా..
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జనగామ: జిల్లాలో రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికలు అనేక రాజకీయ లెక్కలను తారుమారు చేశాయి. గెలుపు ధీమాతో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు బ్యాలెట్ బాక్సులు తెరుచుకున్న వేళ ఓటమి షాక్‌కు గురయ్యారు. పార్టీ కేడర్, నాయకుల సహకారం, సొంత సర్వేలు అన్నీ అనుకూలంగా ఉన్నాయని తేలినప్పటికీ ఆ నమ్మకం ఫలితాల్లో తారుమారైంది. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్ముకుని ప్రచారం చేసినా.. ఆశించిన ఓట్లు రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఎక్కడ తేడా జరిగింది? ఎవరు వెన్నుపో టు పొడిచారు? అంటూ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ, రాజకీయ భవిష్యత్‌పై మళ్లీ లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
తేడా ఎక్కడ వచ్చింది..
జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులు తీవ్ర మదనంలో మునిగిపోయారు. ఎలా ఓడిపోయాం, ఎక్కడ తేడా వచ్చింది, ఎవరు మోసం చేశారనే లెక్కలతో రోజులు గడుపుతున్నారు. ప్రచారంలో నాయకులు సహకరించారు, పార్టీ కేడర్ అడుగడుగునా వెంట నడిచింది, మెజార్టీ మనదేనన్న ధీమా చివరి నిమిషం వరకూ ఉంది. కానీ బ్యాలెట్ బాక్సులు తెరిచి లెక్కించే సరికి ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడంతో షాక్‌కు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వార్డు సభ్యులు లక్షలు, కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రచారం మొదటి రోజు నుంచి పోలింగ్ రోజు వరకు ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయని ప్రచారం ఉంది. అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకొని, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగిన వారు ఎందరో.
చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా
పోలింగ్ ముగిసే చివరి నిమిషం వరకు గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అభ్య ర్థులకు ఫలితాలు చుక్కలు చూపించాయి. పార్టీ ఇంటెలిజెనన్స్ నివేదికలు, సొంత సర్వేలు కూడా మనమే గెలుస్తాం అన్న భరోసా ఇచ్చినప్పటికీ, లెక్కింపులో పరిస్థితి తలకిందులైంది. కనీసం రెండో స్థానంలో నిలుస్తామనుకున్న వారు మూడు, నాలుగో స్థానాల్లో నిలవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అన్నా, తమ్ముడూ.. అంటూ ఆశీర్వదించిన ఓటర్లు చివరకు ఎందుకు తిరస్కరించారని అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారు. గండి ఎక్కడ పడిందో, పక్కనే తిరుగుతూ వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగంగా ఎవరినీ నిందించకపోయినా, లోలోపల వెన్నుపోటు పొడిచిన వారి జాబితాను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఎక్కడెక్కడ చేజారిపోయిందంటే..
జనగామ మండలం పెంబర్తిలో రెబల్ అభ్యర్థి గెలుపొందగా బీఆర్‌ఎస్ బలబర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలవగా, తమ్మడపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
మనస్విని
కీర్తన
అప్పులు తెచ్చి, ప్లాట్లు అమ్ముకుని ఖర్చు చేస్తే.. చివరికి ఓటమి
ప్రచారం జోరు.. ఫలితాల్లో ఫెయిల్
ఎవరు మోసం చేశారు.. ఓటమి తర్వాత మొదలైన లెక్కలు
రెండో స్థానం ఓకే... మూడుగు దిగజారడం ఏంటి?
అభ్యర్థుల లెక్కలు తారుమారు చేసిన రెండో విడత పోలింగ్
నోట్ల వర్షం కురిపించినా..
నోట్ల వర్షం కురిపించినా..


