ఓటోత్సాహం
మండలాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు:
మహిళల చురుకై న భాగస్వామ్యం
జనగామ: రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లలో ఓటర్ల చైతన్యం కనిపించింది. నాలుగు మండలాల పరిధిలో తమ ఓటుతో మార్పును కోరుకున్నారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, జనగామ, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో రెండో విడత ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికలు గ్రామీణ ప్రజాస్వామ్యానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. నాలుగు మండలాల్లో కలిపి 88.52 శాతం పోలింగ్ నమోదు కావడం ఓటర్ల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. నియోజకవర్గంలో మొత్తంగా 1,07,067 మంది ఓటర్లు ఉండగా, 94,776 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన సందడి మధ్యాహ్నానికి మరింత ఊపందుకుంది. ఉదయం 9 గంటల వరకు 16.72 శాతం పోలింగ్ నమోదుకాగా, 11 గంటల వరకు 51 శాతం దాటింది. మధ్యాహ్నం 1 గంటల వరకు 81.20 శాతం పోలింగ్ నమోదు కాగా, ఓవరాల్‌గా 88.52 శాతంతో ముగించారు. మండలాల వారీగా చూస్తే జనగామ మండలం 91.03 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళా ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.
మండలాల వారీగా విశ్లేషణ
జనగామ మండలంలో రికార్డు స్థాయిలో 91.03 శాతం పోలింగ్ నమోదై అగ్రస్థానంలో నిలిచింది. 33,137 ఓటర్లు ఉండగా, పురుషులు 15,043, మహిళలు 15,122 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 30,165 ఓట్లు పోలయ్యాయి. రాజకీయ చైతన్యం, పోటీ తీవ్రతే ఈ అధిక పోలింగ్‌కు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నర్మెట మండలంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతంలో 20,096 ఓట్లు ఉండగా, పురుషులు 8,941, మహిళలు 8,909 మంది ఓటు వేశారు. మొత్తంగా 17,850 ఓట్లు పోలు కాగా, 88.82 శాతం పోలింగ్ నమోదైంది. తరిగొప్పుల మండలంలో 15,283 ఓట్లు ఉండగా, పురుషులు 6,738, మహిళలు 6,734 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 13,472 ఓట్లు పోలయ్యాయి. 88.15 శాతం పోలింగ్‌తో నర్మెటకు సమీపంగా నిలిచింది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకోవడంతో ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. బచ్చన్నపేట మండలంలో ఇతర మండలాలతో పోలిస్తే చాలా తక్కువగా 86.35 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం తర్వాత ఓటర్ల రాక అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మండలంలో 38,551ఓట్లు ఉండగా, పురుషులు 16,520, మహిళలు 16,769 మంది, మొత్తం 32,289 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
రాజకీయ ప్రాధాన్యం..
గ్రామ స్థాయి పాలనకు సర్పంచ్ ఎన్నికలు పునాది కావడంతో, ఇవి భవిష్యత్తు రాజకీయాలపై ప్రభా వం చూపనున్నాయి. అధిక పోలింగ్ శాతం ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడంలో ఎంతటి అవగాహనతో ముందుకు వస్తున్నారో సూచిస్తోంది.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52శాతం పోలింగ్
91.03శాతం పోలింగ్‌తో జనగామ మండలం అగ్రస్థానం
భారీగా తరలివచ్చిన మహిళలు, యువత
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
మండలం ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తం
బచ్చన్నపేట 38,551 16,520 87.74 16,769 85.03 86.35
జనగామ 33,137 15,043 91.41 15,122 90.66 91.03
నర్మెట 20,096 8,941 90.19 8,909 87.50 88.82
తరిగొప్పుల 15,283 6,738 88.46 6,734 87.84 88.15
మొత్తం 1,07,067 47,242 89.44 47,534 87.62 88.52
రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో మహిళల పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం ఓటింగ్‌లో పురుషుల పోలింగ్–89.44 శాతం, మహిళల పోలింగ్ 87.62 శాతంగా నమోదైంది. కొన్ని మండలాల్లో మహిళల పోలింగ్ పురుషులకు సమానంగా ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా రాజకీయ చైతన్యం పెరుగుతున్న దానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మొదటి విడతలో 87.33 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతకు వచ్చేసరికి 88.52తో 1.19 శాతం ఓట్లు పెరిగాయి. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఓటర్లకు అవగాహన కల్పించడంతో ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు.
ఓటోత్సాహం
ఓటోత్సాహం
ఓటోత్సాహం
ఓటోత్సాహం


