మలిపోరుకు సిద్ధం!
మహిళలు..యువతే కీలకం
గ్రామ భవిష్యత్తుకు ఓటే దారి
జనగామ: గ్రామవీధుల గోడలపై పోస్టర్లు అభ్యర్థుల గుర్తులను జ్ఞాపకం చేస్తుంటే..ప్రతీ ఇంటి ముందు పోలింగ్ గురించే చర్చ జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో జరగనున్న రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు గ్రామాల్లో రాజకీయ నిశ్శబ్దం అలుముకుంది. ప్రజల మనసుల్లో మాత్రం తీర్పు ప్ర క్రియ మొదలైపోయింది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తుది ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, మరోవైపు గ్రామస్తులు తమ ఓటు గ్రామ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారో లెక్కలు వేసుకుంటున్నారు.
నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఈనెల 14న(ఆదివారం) రెండో విడతలో పోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జనగామ మండలానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులం, మిగతా మూడు మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశారు. పీఓలు 853, ఓపీఓలు 1,039 మంది, ఇతర సిబ్బందితో సహా మెటీరియల్‌ను 29 రూట్ల వారీగా 45 బస్సుల్లో పోలీసు ఎస్కార్ట్ నడుమ తరలించారు. రెండో విడతలో 79 గ్రామపంచాయతీలు, 710 వార్డులు ఉన్నాయి. ఇందులో 6 చోట్ల సర్పంచ్‌లు, 155 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా 73 జీపీల్లో 245 మంది సర్పంచ్, 555 వార్డుల్లో 1,310 మంది బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో 27 క్రిటికల్ గ్రామాలు ఉన్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. పోలింగ్, ఆ తర్వాత లెక్కింపు, గెలుపోటముల తర్వాత అలర్లు, గొడవలకు ఆస్కారం లేకుండా అధికారులు అక్కడ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ప్రతీ మండలంలో ఏసీపీ ర్యాంకు ఉన్నతాధికారి పర్యవేక్షణలో పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర గస్తీ కొనసాగుతోంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కఠినంగా అమలు లో ఉందని అధికారులు స్పష్టం చేశారు. డబ్బులు, మద్యం, గిఫ్టుల పంపిణీపై ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటి క్ టీములు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఆగడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
జనగామ నియోజకవర్గంలో నెల రోజుల ముందుగానే ప్రతి పల్లె సంక్రాంతి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఊరి అభివృద్ధి ప్రదాతను ఎన్నుకునేందుకు పనులన్నీ వదులుకుని కుటుంబాలు ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రతీ గ్రామంలో సందడి నెలకొంది. యాదృశ్చికంగా ఆదివారం సెలవు రోజు పోలింగ్ రావడంతో ఓటింగ్ శాతం మొదటి విడత కంటే పెరుగుతుందని భావిస్తున్నారు. గ్రామంలో బస్సు దిగే సమయం... కార్లలో ఇంటి ముందు ఆగడమే ఆలస్యం... అభ్యర్థులు వాలిపోతూ ‘అన్నా.. అక్కా... తమ్ముడు.. బావ..’ అంటూ వరుసలు పెట్టి మరీ ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
జనగామ నియోజకవర్గంలోని
4మండలాల్లో ఏర్పాట్లు పూర్తి
ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు పటిష్ట భద్రత, నిఘా
అభ్యర్థుల భవితవ్యం మార్చనున్న
మహిళలు, యువత ఓట్లు
రెండో విడత ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం కీలకంగా మారనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలు, యువత పోలింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గ్రామ అభివృద్ధిపై తమ ఆశలను ఓటు రూపంలో వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నాలుగు మండలాల్లో 1,10,120 ఓట్లు ఉండగా, ఇందులో పురుషులు 54,344, మహిళలు 55,775, ఇతరులు ఒకరు ఉన్నారు. బచ్చన్నపేట మండలంలో అత్యధికంగా 20,208 మహిళా ఓట్లు ఉండగా, అత్యల్పంగా తరిగొప్పులలో 8,079 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా లక్ష ఓట్లలో 30వేల వరకు 18 నుంచి 35 ఏళ్ల లోపు యువకుల ఓట్లు ఉంటాయి.
రెండో విడత పోలింగ్‌తో జిల్లాలో గ్రామ పాలనకు కొత్త దిశ నిర్ణయించబడనుంది. ప్రతి ఓటు గ్రామఅభివృద్ధికి కీలకమని అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో వందశాతం ఓటింగ్‌తో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సొంతూరును వదిలి బతుకు దెరువు కోసం వె వెళ్లిన కుటుంబాలను పోలింగ్ రోజు రప్పించేందుకు సర్పంచ్, వార్డు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఓటింగ్‌ను పెంచేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ తమదైన శైలిలో అభ్యర్థిస్తున్నారు.
మలిపోరుకు సిద్ధం!
మలిపోరుకు సిద్ధం!
మలిపోరుకు సిద్ధం!
మలిపోరుకు సిద్ధం!


