ప్రలోభ పర్వం!
తాగినంత మందు.. ఓటు లెక్కన నగదు!
జనగామ: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ప్రచార హోరు ముగిసి, మైకులు మూగబోయాయి. రెండు వారాల పాటు ఇంటింటా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓట్లకు గాలం వేసేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. దీంతో ప్రచారంతో పాటు ప్రలోభాలు ఊపందుకున్నాయి. రెండో విడతలో ప్రచారం ఊపందుకోగా, తొలి విడత పోలింగ్‌కు అంతా సమాయత్తమ వుతున్నారు. జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల్లో ప్రచారానికి తెరపడగా, ఈ నెల 11న (గురువారం) మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. మద్యం, నగదు పంపిణీకి ఎవరూ కూడా వెనకాడడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, కష్టం వచ్చిన సమయంలో ఆదుకునే మనస్తత్వం కలిగిన సర్పంచ్ అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓటర్లను ఆకర్శించేందుకు..
పంచాయతీ ఎన్నికల పోరులో మొదటి విడతకు ఒక్కరోజే మిగిలిఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడింది. దీంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించే విధంగా ఒకరికి మించి ఒకరు పోటీపడుతున్నారు. తొలి విడతలో 110 గ్రామ పంచాయతీల పరిధిలో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, 351మంది, 1,024 వార్డుల్లో 228 ఏకగ్రీవం కాగా 2,082 వార్డుల్లో ఎలక్షన్లు జరుగనున్నాయి. ఏకగ్రీవమైన జీపీల్లో ఎన్నికల హడావిడి కనిపించడం లేదు.
ఒక్క మొదటి విడతకే..
జిల్లాలో మొదటి విడత జరిగే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి ఈ నెల10వ తేదీ వరకు సుమారు రూ.50 కోట్ల మేర ఖర్చు జరిగినట్లు చర్చ నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండగా, ఓటు లెక్కన డబ్బులు పంచాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఢమాలై, నగదు చేతి మార్పిడి తగ్గిపోయిన సమయంలో ఇన్నాళుల ఇబ్బంది పడ్డ చాలా మంది.. ప్రస్తుతం బరిలో నిలిచిన వారే. ఎలక్షన్లు వచ్చే సరికి లక్షల రూపాయల ధనం బయటకు తీసుకు వచ్చి నీళ్లలా వదిలేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ముగిసిన
తొలివిడత
పంచాయతీ
ఎన్నికల ప్రచారం
పైసల పంపిణీ..
రహస్య ప్రాంతాల్లో
విందులు
పనిచేయని ఎలక్షన్ టీంల పర్యవేక్షణ
ఎన్నికలకు ఒక్క రోజు మిగిలి ఉండడంతో అభ్యర్థులకు కీలక పరీక్ష నెలకొంది. రెండు వారాల ఖర్చుతో పోలిస్తే...పోలింగ్‌కు ఒక్క రోజు ముందు చేసే వ్యయం మూడు రెట్లు పెరుగుతుంది. ఇప్పటివరకు లక్షల్లో మద్యానికి ఖర్చు చేయగా, ఓటుకు రూ.5 వందల నుంచి రూ.3వేల వరకు మేజర్ పంచాయతీలు, పెద్ద గ్రామాలు) ఇచ్చేందుకు పలుచోట్ల నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు ఓటు నజరానా కింద గిఫ్టు ప్యాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థులు ఒకరికొకరు పోటీ పడుతూ, నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో మద్యం, నగదును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఎలక్షన్ నిఘా, షాడో టీంలు తిరుగుతున్నా పార్టీల కేడర్, అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు కొన్ని గంటల ముందు( తెల్లవారుజాము)న ఓట్లకు డబ్బులు పంచేందుకు చాలా చోట్ల రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓటు కు ఎంత ఇస్తున్నారనే నిర్ణయం మేరకు కవర్లలో ప్యాక్ చేసి, బూత్‌ల వారీగా పంపించినట్లు ఊరూరా మాట్లాడుకోవడం కనిపించింది.
సర్పంచ్‌గా గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చిట్టచివరి అవకాశంగా, తమ భవితవ్యాన్ని తేల్చుకునేందుకు ఇన్నాళ్లు దాచుకున్న అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. మందు, విందులతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలు, రిసార్టులు, రహస్య ప్రాంతాల్లో విందులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారం ముగిసిన నాటి నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా దావత్‌లతో పాటు అవసరమైతే ఓటర్లు ఉన్న ప్రాంతానికే మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారు. పెగ్గు, పెగ్గుకూ మద్దతు దారులు చేజారిపోకుండా గుర్తును ఒకటికి రెండు సార్లు గుర్తుచేస్తున్నారు. బ్యాలెట్ పేపర్‌పై వరుస క్రమంలో ఉన్న గుర్తులను చూపిస్తూ అన్నా మరచిపోవద్దు, ఏమరుపాటుగా ఉండే ఓడిపోతామే అంటూ బతిమిలాడుకుంటున్నారు. విందు సమయంలో ముక్క ఏసుకోరాదే అంటూ ప్రేమను పండిస్తున్నారు. చీకటి పడగానే చాలా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎలక్షన్ కమిషన్ నగదు, మధ్యం పంపిణీపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆవేమీ పట్టించుకోవడం లేదు. పలువురు అభ్యర్థులు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరికీ అనుమానం రాని వ్యక్తుల ఇళ్లలో మద్యం బాటిళ్లను డంపింగ్ చేసి, అవసరమున్న చోటకు అనుచరులు చేరవేస్తున్నారు.


