రూ.21 కోట్ల సైబర్ దోపిడీ
జనవరి నుంచి ఇప్పటివరకు నయా నేరగాళ్ల పంజా
‘డబ్బుల్’కు ఆశపడి..
జనవరి నుంచి సైబర్ మోసాలు, సొత్తు (రూ.లలో) ఇలా..
వెంటనే ఫిర్యాదు చేస్తేనే రికవరీ సాధ్యం..
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ. 21,74,51,300 కొల్లగొట్టారు. 68 కేసుల్లోనే ఇంత భారీగా నగదు దోచుకోవడం సంచలనంగా మారింది. 2024లో 772 కేసుల్లో రూ.24,70,43,738 సొత్తు సైబర్ నేరగాళ్ల చేతికిపోతే, ఈసారి 69 కేసుల్లో రూ.21,74,51,300 నగదు పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే కేసుల సంఖ్య భారీగా తగ్గినా, తక్కువ మంది బాధితులే ఎక్కువ మొత్తంలో నగదు పొగొట్టుకోవడం విస్తుగొల్పుతోంది. ముఖ్యంగా ఈ మోసపోయిన వారిలో ఉన్నత విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం.
ముఖ్యమైన కేసులిలా...
● మోనార్క్ నెట్‌వర్క్ క్యాపిటల్ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో యాడ్ రావడంతో చూసిన నగరానికి చెందిన ఇద్దరు వైద్యులు క్లిక్ చేయడంతో ఆటోమేటిక్‌గా వీరి ఫోన్ నంబర్లు సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్‌ల్లో యాడ్ చేశారు. వారు ప్రొఫెషనల్ అడ్వయిజర్లుగా చెప్పుకుంటూ రోజువారీగా ఐదు నుంచి 20 శాతం లాభాలొస్తాయంటూ నమ్మబలికారు. ఇలా ఆ మాటలు నమ్మి వారు చెప్పిన విధంగా నకిలీ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ మోనార్క్ ఫిన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో 41 ఏళ్ల ఓ వైద్యుడు 27 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.1.4 కోట్లు బదిలీ చేశారు. మరో వైద్యుడు 13 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ డబ్బులు డ్రా చేసేందుకు ట్యాక్స్ కట్టాలని, టీమ్ డిపాజిట్ కింద రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇవీ చెల్లించాక కూడా విత్‌డ్రా ఆప్షన్ డిసబుల్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో మోసమని సైబర్ క్రైమ్ పోలీసులను ఈ నెల 3న సంప్రదించారు.
● నగరానికి చెందిన ఓ న్యాయవాదికి వరుసగా వివిధ శాఖల అధికారులమని కాల్స్ చేసి ‘మీపై నగ్న వీడియోలు సర్క్యులేట్ నుంచి మానవ అక్రమ రవాణా వరకు వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి..’అని నకిలీ ఎఫ్‌ఐఆర్, తప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు చూపించి అరెస్ట్ చేస్తామంటూ భయబ్రాంతులకు గురిచేశారు. చివరగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారిగా మళ్లీ ఫోన్‌కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ.. ఈ కేసులు క్లియర్ చేసేందుకు సెక్యూరిటీ అమౌంట్ ఇవ్వమనడంతో అప్పటికే భయపడిన న్యాయవాది రూ.42లక్షలు నేరగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. మరుసటిరోజు కాల్ చేసి రూ.32 లక్షలు ఇవ్వాలనడంతో మోసమని సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
వరంగల్ పోలీసు
కమిషనరేట్ పరిధిలో 68 కేసులు
వీటిలో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ 43
ఆ తర్వాతి స్థానంలో డిజిటల్ అరెస్ట్‌తో బాధితులకు టోకరా
1930 ద్వారా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తేనే రికవరీకి ఛాన్స్
ఈ ఏడాది ప్పటివరకు నమోదైన 68 కేసుల్లో బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ (వ్యాపార, పెట్టుబడి మోసాలు) 43 కేసులున్నాయంటే మనిషి ఆశను సైబర్ నేరగాళ్లు ఎలా శ్రీక్యాష్‌శ్రీ చేసుకుంటున్నారో తెలుస్తోంది. తక్కువ, డబ్బులతో పెట్టుబడి.. ఒక్కరోజులోనే రెండింతలు అంటూ వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో సోషల్ మీడియా వేదికగా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లు చేస్తున్నారు. ఆరంభంలో రూ.100లు పెడితే రూ.200లు రావడంతో ఇది నిజమని అనేక మంది రూ.వేలు, రూ.లక్షలు వరకు పెట్టుబడి పెట్టాక అసలు మోసం అర్థం అవుతోంది. లాభాలు దేవుడెరుగు కానీ, పెట్టిన డబ్బులు కూడా పోవడంతో అది మోసమని గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదిస్తున్నారు.
పొయిన సొత్తు రూ. 21,74,51,300
రికవరీ సొత్తు రూ 1,73,44,677
అరెస్టయిన నిందితులు 9 మంది (15 కేసుల్లోనే)
డబ్బులు మోససోయిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటే అక్కడివరకే పోలీసులు ఆయా బ్యాంకుల ఖాతాలను ఫ్రీజ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్‌మెంట్ మోసం ఆలస్యంగా గుర్తిస్తుండడంతో ఈ కేసుల్లో భారీగా రికవరీ సాధ్యం కావడం లేదు.
– గిరికుమార్, సైబర్ క్రైమ్ ఏసీపీ


