మక్కల పైసలు రాకపాయె!
● పంట విక్రయించి నెల రోజులు..
● ఇప్పటికీ పడని డబ్బులు..
రైతుల ఎదురుచూపు
● చెల్లించాల్సిన మొత్తం రూ.1,34,28,000
పాలకుర్తి టౌన్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పంట ఉత్పత్తులను తూకం చేసి నెల రోజులు దాటినా చేతికి డబ్బులు అందడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లా మొత్తానికి పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించాయి. జిల్లాలో నవంబర్ 8 నుంచి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేపట్టారు. క్వింటాకు రూ.2,400 చొప్పున ఎఫ్‌ఎస్‌సీఎస్ కొనుగోలు చేస్తోంది. మక్కలను తూకం చేసిన పది రోజు ల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉండగా నెల రోజులు దాటినా రాకపోవడంతో రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కూలీ లకు సై తం డబ్బులు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు పంట నష్టం..
ఆరుగాలం కష్టపడి పంటలు చేతికి వచ్చే సమయంలో మోంథా తుపాను వచ్చి మొక్కజొన్న రైతులకు భారీగా నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో గిట్టబాటు ధర లభిస్తుందనే ఆశతో మక్కలను ఆరబెట్టి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. కూలీల ఖర్చు పెరిగిపోయిందని వాపోతున్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల్లో 153 మంది రైతులు మొక్కజొన్న విక్రయించగా డబ్బులు ఎవరికీ రాలేదని తెలిపారు.
రెండ్రోజుల్లో నగదు జమ..
మొక్కజొన్న రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. మంజూరు కాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. రెండ్రోజుల్లో డబ్బులు జమకానున్నాయని ఉన్నతాధికారులు చెప్పారు. రైతులకు సకాలంలో డబ్బులను అందజేసేలా ఏర్పాటు చేస్తాం.
– వై.రంజిత్‌రెడ్డి, మేనేజర్, మార్క్‌ఫెడ్
అమ్మిన మొక్కజొన్నలు: 5,595 క్వింటాళ్లు
రైతులు సంఖ్య: 153
రావాల్సిన డబ్బు: 1,34,28,000


