కుర్చీపై మోజు.. ఖర్చంటే కలవరం
పదవి పిలుస్తున్నా.. భయపెడుతున్న వ్యయం
జనగామ: సర్పంచ్ కుర్చీ పిలుపుతో ఆశావహులు తమ కలలలోకంలో విహరిస్తున్నారు. కానీ ఆ కలల వెంట వచ్చే ఖర్చుల లెక్కలు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులే మిగిలి ఉండడంతో ఖద్దర్ నేతలు రోడ్డెక్కెస్తున్నారు. పదవి కోసం పరుగు మొదలైతే... ఖర్చు టెన్షన్ నీడలా వెన్నంటి నడిచి వస్తోంది. సర్పంచ్ కుర్చీ కళ్లముందు కనిపిస్తుంటే..పోటీకి సై అంటున్న సమయంలో ప్రజల నుంచి వచ్చే గౌరవాలు, మీటింగ్‌లు, హడావిడి సర్పంచ్ హోదా కలిగిన ఫీలింగ్ వచ్చేస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో ఆశావహులు పాత ఖద్దరు అంగీలను మడత పెట్టి.. చమక్కుమంటున్న కొత్త షర్టులను ఎక్కించేస్తున్నారు. గ్రామంలో ఎవరిని చూసినా.. వీరు కూడా పోటీ చేస్తారా... అని చెప్పుకునేలా ఖద్దరు రాజకీయాల హీట్ పెంచేస్తున్నారు.
అప్పు.. నేనిస్తా...
‘అన్నా ఈసారి సర్పంచ్ పదవికి దిగుతున్నావట కదా...డబ్బులు ఉన్నాయా... అవసరమైతే చెప్పు.. అప్పు ఇస్తా...వడ్డీ సంగతి తర్వాత చూసుకుందాం.. ఎంతకావాలన్నా భయపడకు... ’అంటూ గ్రామాల్లో సర్పంచ్ బరిలో నిలిచే కొంతమందికి అప్పు రూపేణా ఇచ్చేందుకు వడ్డీరాయుళ్లు ముందుకొస్తున్నారు. చాలా గ్రామాల్లో పోటీకి సై అంటున్న ఆశావహుల వద్దకు డబ్బులు ఇచ్చే వడ్డీ వ్యాపారులు క్యూ కడుతున్నారు. ప్రేమగా పలకరింపుతో అప్పులు ఇస్తూ... ఓడినా, గెలిచినా రూ.5, రూ.10 లెక్కన వడ్డీ బాదుతూ వసూళ్లు చేయడం మాత్రం ఖాయం అంటున్నారు ప్రజలు.
గత శాసనసభ ఎన్నికల్లో నాయకుల ఖర్చులను చూసి...గింతేనా అంటూ సింపుల్‌గా లెక్కవేసిన పలువురు ఆశావహులు ఇప్పుడు ఆ ఖర్చులు తమవైపు వచ్చేసరికి ఎంతో కొంత కంగారు పడిపోతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో విందులు, వినోదాలు, సదరు ఖర్చులతో పైసా పైసా వసూలు చేసిన వారంతా... ఇప్పుడు తామే భరించాల్సిన సమయం ఆసన్నం కావడంతో వారికి చెమటలు పడుతున్నాయి. ‘అన్నా పోటీకి సై అనాల్సిందే, రిజర్వేషన్లు ఎప్పుడూ కలిసి రావు... ఛాన్స్ మళ్లొస్తదో రాదో... ఎకరం భూమి అమ్మేద్దాం... అవసరముంటే మళ్లీ కొనొచ్చు... ఖర్చు పెడితే గెలుస్తావు..’ అంటూ వెన్నంటి నడిచే సహచరులు పురమాయిస్తున్నారు. వీరి మాటలు కొందరికి ధైర్యం ఇస్తుంటే, ఎకరం అమ్మైనా గెలవాలవాలనే కొత్త స్లోగన్ గ్రామాల్లో వినిపిస్తోంది.
ఆశావహ ‘ఖద్దరు చొక్కా’ల ఊగిసలాట
ఎంతైనా పోటీలో ఉండాల్సిందేనంటూ సహచరుల భరోసా
20 రోజులు కష్టపడితే
కలనెరవేరుతుందంటూ ధైర్యం
కుర్చీపై మోజు.. ఖర్చంటే కలవరం
కుర్చీపై మోజు.. ఖర్చంటే కలవరం


