ప్రతీ కార్యకర్త కథానాయకుడే
జనగామ: పంచాయతీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌లాంటి నాయకున్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతీ కార్యకర్త కథానాయకుడు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 29న కేసీఆర్ దీక్షా దివస్ సందర్భంగా బుధవారం వరంగల్ పర్యటనను పురస్కరించుకుని జనగామ య శ్వంతాపూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ త్యాగం 16 ఏళ్ల పిల్లలకు తెలిసేలా దీక్షా దివస్ నిర్వహించాలన్నారు. జిల్లాలో దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్యలాంటి మాస్ నాయకత్వం ఉందని, ముగ్గురు లీడర్ల పోరాట పటిమ గొప్పదన్నారు. కార్యకర్తల జోష్ చూస్తుంటే జనగామలో ఊరు, మునిసిపల్, సర్పంచ్, వార్డులు, జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమనే కాన్ఫిడెన్స్ తనకు ఉందన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చిన పార్టీ మారిన కడియం శ్రీహరికి అక్కడి ఓటర్లు కర్రు కాల్చివాత పెట్టేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీలోకి రావాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, తన చివరి రక్తం బొట్టు వరకు కేసీఆర్‌తో ఉంటానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తన విధేయతను చాటి చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినట్టే ఇచ్చి, మగవారికి మాత్రం జేబులు గుల్లచేస్తున్నాడని ఆరోపించారు. చీరల పేరిట రూ.300 చీరను రూ.1200గా చూపించి, సీఎం రేవంత్‌రెడ్డి వాటిపై రూ.450కోట్ల రుణం తీసుకున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం చేసిన నాటకాలు బయటపడ్డాయన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీలు 51శాతం ఉన్నారని తేలిస్తే, రేవంత్‌రెడ్డి కులగణనతో రేవంత్‌రెడ్డి 46 శాతానికి తగ్గించారన్నారు. ప్రభుత్వంలో మంత్రులు ప్రజాసమస్యలను గాలికి వదిలేయడంతోనే జనగామలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఐదుగురు యువకులు గాడిదలకు వినతి పత్రం ఇచ్చి తమ నిరసననను ప్రజాస్వామ్యబద్ధంగా తెలిపితే జైలులో పెట్టడం సిగ్గుచేటన్నారు.
నేటితరం పిల్లలకు కేసీఆర్ పోరాటం గురించి చెప్పాలి
‘స్టేషన్’లో కడియంకు కర్రుకాల్చి
వాతపెట్టడం ఖాయం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఊసరవెల్లికి మారుపేరు కడియం శ్రీహరి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
గులాబీ జెండా నీడన ఎమ్మెల్యేగా విజయం సాధించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లికి మారుపేరని, కాంగ్రెస్‌లో చేరి ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తే కడియంను చిత్తుగా ఓడించేందుకు ఆ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
జూబ్లీహిల్స్ లాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు: ఎర్రబెల్లి
జూబ్లీహిల్స్‌లాంటి ఉప ఎన్నికలను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంతో వందల కోట్లు ఖర్చుపెట్టి చావుతప్పి, కన్నులొట్టపోయిన చందంగా గెలిచారన్నారు.
కడియంకు సీఎం చివాట్లు: పోచంపల్లి
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే, రాజీనామా చేస్తా అంటూ కడియం సీఎం వద్దకు వెళితే చివాట్లు పెట్టి పంపించారని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘దొంగ ఓట్లతో గెలిచాం.. మరో సారి ఉపఎన్నికంటూ వెళితే ఓటమి తప్పదు..’అని సీఎం హెచ్చరించడంతో రాజీనామా చేసేది లేదంటూ కడియం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు.


