ఇద్దరు కాదు..ముగ్గురున్నా ఓకే
జనగామ: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టం–2018లో కీలక నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ పంచాయతీ ఎన్నికల్లో కీలకం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఏపీ పంచాయతీ రాజ్ చట్టం నుంచి తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన అమలులోకి వచ్చింది. మూడు దశాబ్దాల్లో రాష్ట్రంలో సమాజంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్య సేవల అభివృద్ధి, మహిళల్లో విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడం, ఆర్థిక స్థిరత్వం పెరగడం వంటివి జననాల రేటును గణనీయంగా తగ్గించాయి. జననరేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో రాష్ట్ర జనాభా తగ్గుదలతో కార్మిక శక్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎలక్షన్లలో పోటీ చేసే అవకాశం కల్నించాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ చట్టం–2018 లోని సెక్షన్ 21(3) ఇద్దరు పిల్లల నిబంధనను పూర్తిగా తొలగించారు. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇంతకాలం అర్హత కోల్పోయిన వేల మందికి తిరిగి పోటీ చేసే అవకాశం వచ్చేసింది.
పంచాయతీచట్టంలో కీలకమార్పు..ఇద్దరు పిల్లల నిబంధన రద్దు
మూడు దశాబ్దాల తర్వాత ముగ్గురు పిల్లల ఆశావహులకు వరం


