మహిళా సాధికారతకు పెద్దపీట
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి, సాధికారతకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 8,178 మహిళా సంఘాలకు రూ.17.36 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలు పట్టు చీరలలాగా ఎంతో బాగున్నాయని..‘ఎంపీ అయిన మా కావ్యకు కూడా ఒక చీర ఇవ్వాలి’ అని కలెక్టర్‌ను కోరారు. ‘తాను ఊరికే అనడం లేదని, ఇకపై మహిళలకు సంబంధించిన సమావేశాలకు ఆ చీరను ధరించి రావాలని, మహిళా సంఘాలకు చెందిన పాటను పాడుతూ వారితో కలిసి ఆడిపాడాలి..’అని కావ్యకు ఎమ్మెల్యే కడియం సూచించగా కలెక్టర్, ఎంపీతో పాటు సభికులందరి ముఖాల్లో నవ్వుల పూలుపూయించారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఆర్‌డీఓ వసంత, డీపీఎం సతీష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, ఘన్‌పూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు బేతి మంజుల, కోశాధికారి వి.లక్ష్మి, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


