సాధారణ ప్రసవాలు పెంచాలి
జనగామ: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచడంతో పాటు రెగ్యులర్ డెలివరీల సంఖ్య పెరగాలని వరంగల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన దిశ (జిల్లా అభివృద్ధి సహకార మానిటరింగ్ కమిటీ) సమావేశం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొనగా, జిల్లా గ్రామీణభివృద్ధిశాఖ, విద్య, వైద్యం, ఆరోగ్యం, జాతీయ రహదారుల విభాగం, రోడ్లు భవనాలు, తదితర శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. పేదలకు సేవ చేయడమే మనందరి లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కృషితో అభివృద్ధి, అవార్డులు, పథకాల్లో జనగామ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దూసుకుపోతోందని కితాబిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 12 మండలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఒక సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాలతో మంచి సత్ఫలితాలను ఇచ్చిందన్నారు.
సాధారణ ప్రసవాలపై ఎంపీ అసంతృప్తి
జిల్లాలోని ఎంసీహెచ్, సీహెచ్‌సీల్లో వచ్చే మూడు నెలల కాలంలో 70శాతానికి పైగా సాధారణ ప్రసవాలు పెంచాలని ఎంపీ కడియం కావ్య సూచించగా.. జిల్లావె వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం డెలివరీ ప్రగతిని వివరించారు. 40 శాతం సాధారణ, 60 శాతం ఆపరేషన్లు జరిగినట్టు వివరించగా ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాన్పు సమయంలో సదరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, సాధారణ డెలివరీకి డాక్టర్లు ప్రయత్నం చేయాలన్నారు. వచ్చే దిశ సమావేశంలో అపరేషన్ చేసిన ప్రతి డెలివరీకి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. సంస్థాగత డెలివరీలతో పాటు సాధారణ ప్రసవాలను పెంచేలా దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భిణులు మొదటి చెకప్ నుంచి చివరి వరకు ఆశాలు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీల పర్యవేక్షణ ఉండాలన్నారు.
వచ్చే సమీక్షలో ప్రతీ సిజేరియన్‌కు వైద్యులు సమాధానం చెప్పాలి
జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది
దిశ సమీక్షలో వరంగల్ ఎంపీ, కమిటీ చైర్మన్ కడియం కావ్య
రహదారులపై చర్చ
జిల్లాలోని జనగామ–దుద్దెడ, వరంగల్–హైదరాబాద్ హైవేలపై చర్చ జరిగింది. పెంబర్తి నుంచి కరుణాపురం 45 కిలోమీటర్ల పరిధిలోని నిడిగొండ, ఛాగల్, చిన్నపెండ్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం ఐదు లొకేషన్ల పరిధిలో రోడ్డు మరమ్మతుల కోసం రూ.5.3కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభం కావాల్సి ఉన్నట్లు అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు సేఫ్టీ కోసం 20 లొకేషన్ల పరిధిలో సోలార్ సిస్టం, ఇతర ప్రమాద నివారణ చర్యలు తీసుకునేందుకు మరో రూ.4కోట్లు మంజూరు అయినట్లు వివరించారు. మలుపులు, యూటర్న్, హైవేపై వీధి దీపాలు, ఇతర ప్రమాద ఘటనలకు సంబంధించి చర్యలు శూన్యమని ఎంపీ కావ్య అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. నేషనల్ హైవేపై సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. బచ్చన్నపేట రోడ్డు నిర్మాణానికి సంబంధించి కోర్టు ప్రాసెస్ ముగిసిన వెంటనే పనులు మొదలవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. రహదారుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లేకుండా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని దిశ కమిటీ మెంబర్ బక్క శ్రీనివాస్ అన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, దిశా కమిటీ సభ్యులు మాధవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


