అనాథ పిల్లలకు చేయూత
జనగామ: జనగామ పట్టణం నెహ్రూ పార్క్ ఏరియాలోని సెయింట్‌పాల్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు సోమవా రం అనాథ పిల్లలకు భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన బాలల దినో త్సవం, ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా సేకరించిన రూ.1,12,217లను కరుణాలయం ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియ జోసఫ్ ఆధ్వర్యంలో ఫాదర్ అలెక్స్‌కు విరాళంగా అందించారు. అనంతరం మరియ జోసఫ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సెయింట్‌పాల్స్ విద్యార్థులు చదువుతో పాటు సేవాపరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారన్నారు.
కొమురవెల్లి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడిగా నర్సింహారెడ్డి
నర్మెట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యుడిగా మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి ఎంపికయ్యారు. ఈపదవిలో డిశంబర్ 10 నుంచి 2026 మార్చి 21 వరకు ఆయన కొనసాగనున్నట్లు దేవాదాయ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గడ్డం వివేక్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ శాసన సభ్యుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితర నాయకులకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి రూ.50వేల విరాళం
బచ్చన్నపేట: మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శివసీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఎండీ షర్పద్దీన్ తన నానమ్మ, తాత ఎండీ సకినాబి, బాస్మియా, తండ్రి మునిరుద్దీన్ జ్ఞాపకార్థం రూ.50,116లను విరాళంగా అందించారు. ముస్లిం అయి ఉండి కూడా హిందూ దేవాలయానికి ఆర్థిక సహాయం అందించిన షర్పద్దీన్‌ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో సిద్దేశ్వరాలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు సుంకె కనుకయ్య, నాచగోని సిద్దులు, బండపల్లి శంకరయ్య, బక్కెర సిద్దయ్య, నర్మెట చంద్రమౌళి, అంజనేయులు, జయరాం, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
‘టీచర్ల తనిఖీ బృందం’లో చోటు కోసం పైరవీలు?
జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, ఉపాధ్యాయుల పనితీరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తదితర వాటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల తనిఖీ ప్రోగ్రాంలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారనే సమాచాం వినిపిస్తోంది. జిల్లాలో టీచర్ల తనిఖీ బృందాలకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో తుది జాబితా విడుదల కానుంది. ఈనేపథ్యంలో తనిఖీ బృందాల్లో తాము సైతం ఉండబోతున్నామనే కొందరి ప్రచారంతో ఉపాధ్యాయ సంఘాల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. తనిఖీల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్లు పని చేసే బడుల్లో గత ఏడాది, ప్రస్తుతం పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. పట్టింపుల్లేకుండా వ్యవహరించే పలువురు టీచర్లు తనిఖీ అధికారిగా బాధ్యతలు వచ్చేస్తున్నాయని ముందస్తుగా తమ సహచర టీచర్లతో మాట్లాడుకోవడం విద్యాశాఖలో చర్చకు దారి తీస్తోంది. తనిఖీ బృందానికి సంబంధించి అత్యంత సీక్రెట్‌గా జాబితా తయారు చేస్తున్నప్పటికీ, ముందస్తు లీకేజీలు ఏంటనే ప్రశ్న విద్యాశాఖ పనితీరును ఎండగడుతుంది.
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్ : చదువుతోపాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సూచించారు. మంగళవారం కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్‌డే సందర్భంగా వివిధ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతి ఏటా విద్యార్థినులకు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.


