ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
తరిగొప్పుల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లలో రైతుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మండలంలోని నర్సాపూర్, అబ్దుల్‌నాగారంలో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని పరిశీలించారు. అనంతరం అబ్దుల్‌నాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. ప్రతీ మహిళకు చీర అందాలని సూచించారు. ధాన్యాన్ని తేమ శాతం రాగానే కొనాలని, ఎక్కువ రోజులు కొనకుండా ఉంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. దిక్సూచిలో భాగంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో అందరికీ హెల్త్‌కార్డులు అందించారా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మొగుళ్ల మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ బోజనపల్లి లావణ్య, ఎంపీఓ కృష్ణకుమారి, ఆర్‌ఐ ఆంఽధ్రయ్య, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి అనితారాజేశ్వర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, శేఖర్ పాల్గొన్నారు.


