ప్రమాదమని తెలిసి..పట్టాలు దాటి..
● నెలరోజులుగా స్టేషన్‌ఘన్‌పూర్
ఎఫ్‌ఓబీ మూసివేత
● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్‌ఓబీ) శిథిలావస్థకు చేరి పాక్షికంగా కుంగిపోవడంతో రైల్వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకూ మరమ్మతు పనులు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు విషయంలో రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు శాపంగా మారింది. రైల్వేస్టేషన్ నుంచి రెండో ప్లాట్‌ఫారం పైకి వెళ్లే ప్రయాణికులు, రెండో ప్లాట్‌ఫారం నుంచి రైల్వేస్టేషన్‌కు, ఒకటో ప్లాట్‌ఫారానికి వచ్చే ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. ప్రతీరోజూ వివిధ పనులపై వందలసంఖ్యలో ప్రజలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే రెండో ప్లాట్‌ఫారంపైకి వచ్చే రైళ్లు ఎక్కడానికి ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మూసివేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పట్టాలపై నుంచి వెళ్తున్నారు. ఇప్పటికై నా రైల్వే అధికారులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రమాదమని తెలిసి..పట్టాలు దాటి..


