లెక్కలు తలకిందులు
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025
జనగామ: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ ఆదివారం పూర్తికావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ సమీకరణాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. గత రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి జనరల్ కేటగిరీ పెరగడం, బీసీ స్థానాలు తగ్గడం, ఎస్టీ కేటగిరీ పెరగడం రాజకీయ నాయకుల లెక్కలను తలకిందులు చేసింది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల సమక్షంలో ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న ఆధ్వర్యంలో లాటరీ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయింపులు పారదర్శకంగా పూర్తయ్యాయి. జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామపంచాయతీల పరిధిలో 2,534 వార్డులకు సంబంధించి ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
పార్టీల వ్యూహాలు–స్వతంత్రుల కసరత్తు
తాజా రిజర్వేషన్లలో లెక్కలు మారడంతో పలువురు ఆశావహులకు నిరాశకు లోనయ్యారు. ఆయా గ్రామాల్లో మహిళలకు ఉన్న స్థానాలు జనరల్‌గా మారడం ఉత్సాహాన్ని పెంచింది. అధికార పార్టీతో పాటు బీజేపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందస్తుగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
పల్లెల్లో ఎన్నికల వాతావరణం..
పల్లెల్లో టీ దుకాణాలు, సెలూన్లు, కిరణా దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సమావేశాలతో ఎక్కడ చూసినా సర్పంచ్ రిజర్వేషన్ గురించే చర్చ జరుగుతోంది. గ్రామం ఏ కేటగిరీలో పడింది, ఈసారి ఎవరికి అవకాశం వంటి ప్రశ్నలతో ప్రజలు స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, వారి అనుచరులు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు.
జిల్లా రిజర్వేషన్ల తీరు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 280 జీపీల వారీగా కేటాయించిన రిజర్వేషన్లలో ప్రతీ సామాజిక వర్గానికి జీవో నిబంధనలను అనుసరించి కేటాయింపులు చేశారు. జిల్లాలో ప్రస్తుతం సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు జరిగిన రిజర్వేషన్ల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ కేటగిరీల్లో 23.21శాతం, జనరల్ మహిళ విభాగంలో 20.71 శాతంతో మొత్తం జనరల్ వర్గం వాటా 43.92 శాతం ఉంది. బీసీ జనరల్‌లో 8.93, బీసీ మహిళ కేటగిరీలో 7.14 శాతం కలుపుకుని మొత్తం బీసీ వర్గం వాటాగా 16.07 శాతంగా లెక్కించారు. ఎస్సీ జనరల్‌లో 11.07 శాతం, ఎస్సీ మహిళా విభాగంలో 8.21 శాతం కలుపుకుని మొత్తంగా ఎస్సీ వర్గం వాటా 19.28 శాతం ఉంది. ఎస్టీ వర్గం 100 శాతం గ్రామాలు కలుపుకొని ఎస్టీ జనరల్ 12.14 శాతం, ఎస్టీ మహిళ 8.57 శాతంతో మొత్తంగా ఎస్టీ వర్గం వాటా 20.71 శాతం కేటాయించారు. జిల్లా మొత్తం రిజర్వేషన్లలో సామాజిక వర్గం మొత్తంగా పరిశీలన చేస్తే జనరల్ 43.92 శాతం, బీసీ 16.07 శాతం, ఎస్సీ 19.28 శాతం, ఎస్టీ 20.71 శాతంగా ఉంది. ప్రతీ వర్గంలో మహిళలకు గణనీయమైన స్థాయిలో అవకాశాలు రావడం ప్రత్యేకతగా నిలిచింది. రిజర్వేషన్ పంపిణీ జిల్లాలో సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తూ, అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు లభించేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ముగిసిన సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియ
జనరల్ కేటగిరీలో సీట్లలో పెరుగుదల
బీసీ సీట్లలో తగ్గుదల
తాజా రిజర్వేషన్లతో ఆశ..నిరాశ
అభ్యర్థుల వేటలో రాజకీయ పార్టీలు
అధికార–పోలీసుల ఏర్పాట్లు వేగవంతం
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, రెవెన్యూ, పంచాయతీరాజ్ విభాగాలు ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అదనపు బలగాలు, రాత్రి పర్యవేక్షణ, సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ తదితర వాటికి సంబంధించి దృష్టిసారిస్తున్నారు.
లెక్కలు తలకిందులు
లెక్కలు తలకిందులు


