ఇక పోషణ్‌వాడీ!
అక్కడక్కడ పనులు మొదలయ్యాయి..
లింగాలఘణపురం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలకు ఇప్పటికే అనేక రకాలుగా పౌష్టికాహార లోపం లేకుండా చేపట్టిన కార్యక్రమాలకు తోడుగా మరింత పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం సాక్షం అంగన్‌వాడీ 2.0 పేరుతో పోషణ్ వాటికలను ఏర్పాటు చేయనుంది. అందుకు జిల్లాలోని మూడు ఐసీడీఎస్ పరిధిలో 695 అంగన్‌వాడీ కేంద్రాల్లో 227 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్క కేంద్రానికి ఐదేళ్లకు గాను రూ.10వేల చొప్పున జిల్లాలో రూ.22.70 లక్షలు విడుదల చేసింది.
అందులో చేపట్టాల్సిన పనులు..
అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో 10+10 అడుగుల చదరపు విస్తీర్ణంలో మొక్కలు, మూలికల చెట్లు పెంచేందుకు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో 6 రకాల విత్తనాలు ఉద్యానవనశాఖ ఎంపిక చేసిన పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, మిరపకాయ విత్తనాలను అదేవిధంగా ఔషధ, పండ్ల మొక్కలు మునగ, బొప్పాయి, కరివేపాకు, నిమ్మ, ఉసిరి, దానిమ్మ, అంతేకాకుండా లెమన్‌గ్రాస్, తిప్పతీగ, శతావరి వంటి మొక్కలను నాటి వాటి నుంచి వచ్చే ఫలాలను చిన్నారులకు, బాలింతలకు అందజేయాలని నిర్ణయించింది.
ఖర్చు నిబంధనలు..
పోషణ్ వాటికల ఏర్పాటుకు ఐదేళ్లకు గాను విత్తనా లకు రూ.3వేలు, రవాణా ఖర్చు రూ.వెయ్యి, బెడ్ల తయారీకి రూ.వెయ్యి కాగా ఐదేళ్ల నిర్వహణ సాగునీటి ఖర్చు మరో రూ.5వేలుగా నిర్ణయించింది.
అంగన్‌వాడీల్లో పోషణ్ వాటికల ఏర్పాటు
జిల్లాలో 227 కేంద్రాల ఎంపిక
ఐదేళ్లకు రూ.22.70లక్షలు విడుదల
ఇక అంగన్‌వాడీల వద్దనే పౌష్టిక ఆహార పంటల సాగు
227 కేంద్రాల ఎంపిక
జిల్లాలోని 695 అంగన్‌వాడీ కేంద్రాలకుగానూ సొంత భవనాలు, వసతులు కలిగిన 227 కేంద్రాలను ఎంపిక చేసింది. అందులో జనగామ ఐసీడీఎస్ పరిధిలో 257 కేంద్రాలకు 80, కొడకండ్ల పరిధిలోని 183 కేంద్రాలకు 66, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని 255 కేంద్రాలకు 81 కేంద్రాలను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.10వేలు విడుదల చేసింది. అందులో విత్తనాలకు సంబంధించిన డబ్బులను మినహాయించి మిగిలిన డబ్బులు ఆయా అంగన్‌వాడీ కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి.
జిల్లాలో పోషణ్ వాటిక కింద ఎంపికై న అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. విత్తనాల డబ్బులు మినహా మిగతా డబ్బులు ఆయా కేంద్రాల ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకంతో మరింత పౌష్టిక ఆహారం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
– కోదండరామ్, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ, జనగామ
ఇక పోషణ్‌వాడీ!


