వాట్సాప్‌లో ‘మీసేవ’
● పౌరసేవలు మరింత సులభం
● మొబైల్ ద్వారా సర్టిఫికెట్లు పొందే
అవకాశం
పాలకుర్తి టౌన్: పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని రకాల అవసరాల కోసం వివిధ సర్టిఫికెట్లు పొందడానికి ఇక ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే చేతిలో మొబైల్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రజలకు అవసరమైన సేవలు, సర్టిఫికెట్లను త్వరగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో మీ సేవను ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది.
సేవలు ఎలా పొందవచ్చంటే..
● స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చు.
● మందుగా మొబైల్‌లో మీ సేవ నంబర్ 8096958096ను సేవ్ చేసుకోవాలి.
● వాట్సాప్ నంబర్‌కు హెచ్‌ఐ లేదా ఎంఈఎన్‌యూ(మెనూ) అని టైప్ చేసి సెండ్ చేయాలి.
● మీసేవలో ప్రసత్తుం అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల జాబితా వస్తుంది.
● ఆధార్ ప్రక్రియ పూర్తి చేసి, అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి.
● దరఖాస్తు ఫారమ్‌ను ఇంటర్‌ఫేజ్ ద్వారా నింపవచ్చు.
● దరఖాస్తు చేసే సేవకు అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
● సేవ ఆధారంగా నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించచ్చు
● దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు
● సర్టిఫికెట్, డాక్యుమెంట్ అప్రూవ్ అయితే, దాని డౌన్‌లోడ్ లింక్ వాట్సాప్‌కు వస్తుంది
● అనంతరం దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొబైల్ వాట్సాప్ సేవలను ఎక్కడ నుంచి అయిన పొందవచ్చు.
580 సేవలు..
మీ సేవ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉన్న 580 సేవలు, ఇక వాట్సాప్ చానల్ కిందకు తీసుకొస్తారు. ప్రస్తుతానికి సర్టిఫికెట్లు పొందడానికి అవకాశం ఉంది. వీటిని దశల వారీగా పెంచుకుంటూ పూర్తి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. ఆదాయం, కులం, నివాస, జనన, మరణ, మార్కెట్ విలువ, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సర్టిఫికెట్‌ల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రెవెన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీరాజ్, విద్యుత్, నీటి, ఆస్తి పన్ను, ఆలయాలు, పౌర సరఫరాల సేవలు పొందవచ్చు.


