ఒకేచోట మక్కలు, వడ్లు
● మార్కెట్‌లో స్థలం లేక రైతుల ఇబ్బందులు
● కొనుగోళ్లలో జాప్యంతో పడిగాపులు
పాలకుర్తి టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారు. మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా మొత్తం ఒకే మక్కల కొనుగోలు కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో మక్కలు, వడ్లు ఒకేచోట పోయడంతో సరిపోను స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏఈఓలు టోకెన్ ఇస్తేనే కాంటా పెడతామని సొసైటీ అధికారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో తీవ్రమైన జాప్యంతో ధాన్యం కుప్పల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. పగలంతా ఎండలో, రాత్రి తీవ్రమైన చలితో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. సొసైటీ సిబ్బంది కొనుగోలు వేగవంతం చేయడం లేదని, అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం..
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. రైతులు తీసుకొచ్చిన ధాన్యం, మక్కలను వరుస క్రమంలో ఏఈఓలు ఇచ్నిన టోకెన్ ప్రకారమే కొనుగోలు చేస్తున్నాం. జిల్లా మొత్తంమీద పాలకుర్తిలోనే మక్కల కొనుగోలు కేంద్రం ఉండడంతో ఇప్పటి వరకు 2,500 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేశాం.
–సత్యనారాయణరెడ్డి,
ఎండీ, రైతు సేవా సహకార సొసైటీ, పాలకుర్తి


