ఎక్కడ..!?
దామోదర్ పేరుతో
ఫోన్ చేస్తున్నదెవరు..?
బడే దామోదర్
● మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్
● ఆయన స్వస్థలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి
● లొంగుబాటు ప్రయత్నాలపైనా సోషల్ మీడియాలో వైరల్
● ఆయన పేరిట నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌కు చెందిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఎక్కడ? ఇటీవల సాగుతున్న వరుస లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఆయన వ్యూహం ఏమిటీ? ఓ వైపు ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాడంటుండగా.. మరోవైపు లొంగుబాటు ప్రయత్నం చేస్తున్నాడని వైరల్ అవుతోంది? ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, ఏఓబీలలో కీలకమైన బడే దామోదర్ ఎక్కడున్నాడు? ఏం జరుగుతోంది? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇటీవల ములుగు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన పేరిట ఫోన్ కాల్స్ రావడం, ఓ రాజకీయ నేతను కలవాలని సూచించడం కూడా కలకలం రేపుతోంది.
దామోదర్ వ్యూహం ఏమిటో...
ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే దామోదర్‌ది సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఉద్యమ చరిత్రలో ఓ అధ్యాయం. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021 జూన్ 21న కోవిడ్ బారిన పడి మృతిచెందగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బాధ్యతలను దామోదర్‌కు పార్టీ అప్పగించింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కీలకంగా మారిన ఈయన ఈ ఏడాది జనవరిలో పూజారి కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరలైంది. ఐదారు రోజుల వ్యవధిలో దామోదర్ బతికే ఉన్నట్లు మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఈ 11 నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ నాయకత్వం ఎన్నో ఉత్థానపతనాలను చూసింది. అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లకు గురికావడం.. కేంద్ర కమిటీ స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో దళసభ్యులు ఆయుధాలతో లొంగిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇదే క్రమంలో ఏఓబీ సరిహద్దు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్‌లలో హిడ్మా సహా 13మంది మృతిచెందడం... పదుల సంఖ్యలో ముఖ్య నేతలను విజయవాడలో అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించడం ఆ పార్టీ మనుగడకు సవాల్‌గా పరిణమించింది. ఇదే సమయంలో బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరులు సైతం లొంగిపోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటునుంచి ప్రకటన వెలువడలేదు.
కాల్వపల్లికి చెందిన మావోయిస్టు అగ్రనేత బడే దామోదర్ పేరిట కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఫోన్ కాల్స్ వస్తుండటం కలకలంగా మారింది. తాను దామోదర్‌ను అంటూ ఫోన్ చేస్తున్న సదరు వ్యక్తి.. జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని కలిసి డబ్బులు ఇవ్వాలని సూచించడం వివాదాస్పదమవుతోంది. ఇటీవల ఇద్దరు అధికార పార్టీ నాయకులు, ముగ్గురు ఇసుక వ్యాపారులకు దామోదర్ పేరిట ఫోన్‌లు రావడం.. ఆ ఫోన్‌లో మాట్లాడిన పలు విషయాలను బహిరంగంగానే మాట్లాడుకుంటుండటం గమనార్హం. నిత్యనిర్బంధంమధ్య దామోదర్ ఎక్కడున్నాడు.. ఎలా ఉన్నాడు.. అన్న చర్చ జరుగుతున్న తరుణంలో దామోదర్ వాయిస్‌తో ఫోన్‌లో చేస్తున్నదెవరు? ఒకవేళ దామోదరే అయితే ఎవరిని కలవమన్నారు? అనే అంశాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.


