ప్రతిభావంతులకు భరోసా
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా పేద విద్యార్థులు మధ్యలోనే చదువులను మానేస్తున్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వల్ల ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. అర్హత సాధిస్తే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి 12 వేలు కేంద్రం అందిస్తుంది. గత ఏడాది జిల్లా నుంచి 35మంది విద్యార్థులు అర్హత సాధించారు.
అవగాహన తప్పనిసరి
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చాలామంది పేద, మధ్య తరగతివారే ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు అంతగా చదువులేనివారు కావడంతో ఇలాంటి పరీక్షల వల్ల అవగాహన ఉండదు. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులే చొరవ తీసుకుని పిల్లలచే పరీక్షలు రాయిస్తే వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మంచి భవిష్యత్ ఉంటుంది.
పరీక్ష విధానం..
మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలస్టిక్ ఎబిలిటీ (ఎస్‌ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉండగా ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్– ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బీలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
హాజరుకానున్న 729 మంది విద్యార్థులు
ఈనెల 23న ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పట్టణంలోని జెడ్పీఎస్‌ఎస్ ధర్మకంచ పాఠశాల, ప్రభుత్వ హైస్కూల్ జనగామ, సోషల్ వెల్ఫేర్, జెడ్పీఎస్‌ఎస్ బాలికల పాఠశాల స్టేషన్ ఘన్‌పూర్ మొత్తం నాలుగు సెంటర్లు సిద్ధం చేశారు. డీవోలు, ఎస్‌వోలను నియమించారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మూడు గంటల పరీక్ష ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 103 ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న వారు 729 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు విడుదల కాగా పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
–టి.రవికుమార్, సహాయ సంచాలకుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం
రేపు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్ష
4 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి
అర్హత సాధిస్తే ఏడాదికి రూ.12 వేలు
జిల్లావ్యాప్తంగా 729 మంది విద్యార్థులు
ప్రతిభావంతులకు భరోసా


