‘కడియం’ మరోసారి
● స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే
● వివరణకు మరింత
సమయం కోరిన కడియం శ్రీహరి
● పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై
ఏం తేలనుంది..?
● హాట్‌టాపిక్‌గా మారిన
‘అనర్హత పిటిషన్’ల విచారణ
సాక్షిప్రతినిధి, వరంగల్ : మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్.. సుప్రీం ఆదేశాలతో ఊపందుకున్న విచారణ ఉమ్మడి వరంగల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సుప్రీంకోర్టు డైరక్షన్ మేరకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పార్టీ ఫిరాయింపుల (బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిక) అభియోగం ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వివరణలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం ఈ నెల 23న హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు గురువారమే స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రెండు రోజుల ముందే శుక్రవారం స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరారు. ఆయన అభ్యర్థన మేరకు స్పీకర్ సమయం ఇస్తారా? లేదా?.. సమయం ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు? అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా, ఈ ఎపిసోడ్‌లో కడియం శ్రీహరి వ్యూహం ఏమిటనేది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరగుతోంది.
స్పీకర్ నిర్ణయం కోసం వెయిటింగ్..
కేడర్‌తో సమాలోచనలు..
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి శాసనసభ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో కడియం శ్రీహరి శిబిరంలో అలజడి మొదలైంది. జూలై నుంచి మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా ఆలస్యమైంది. సుప్రీంకోర్డు ఆగ్రహించి నాలుగు వారాల గడువు ఇవ్వగా.. స్పీకర్ ఇటీవల విచారణకు సంబంధించిన ప్రక్రియలో వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే నోటీసు అందుకున్న శ్రీహరి హైదరాబాద్‌లో మకాం వేసి నిపుణులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు మరోసారి గడువు కోరినట్లు సమాచారం. ఆయన అభ్యర్థనను స్పీకర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు? ఎన్ని రోజులు సమయం ఇస్తారు? అనే దానిపై శ్రీహరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే నోటీసులు తీసుకున్నప్పటినుంచి శ్రీహరి.. భవిష్యత్ కార్యాచరణపై తనకున్న ముఖ్య నేతలు, కేడర్ సమాలోచనల్లో పడ్డారని అనుచరవర్గాల సమాచారం.
స్పీకర్‌ను కలిశా.. సమయం కోరా..
శాసనసభాపతి గురువారం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం వారిని కలిశాను. వాస్తవానికి నాపై నమోదైన పిటిషన్‌పై 23న వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరేందుకు స్పీకర్‌ను కలిశా. నా అభ్యర్థన లేఖపై స్పీకర్ స్పందించి ఇచ్చే గడువు ప్రకారం వివరణ ఇస్తా.
– కడియం శ్రీహరి, ఎమ్మెల్యే


