హీటెక్కుతున్న రాజకీయం
అభ్యర్థుల ఎంపికపై పార్టీల నజర్
పల్లెల్లో మళ్లీ మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి
జనగామ: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన వేళ రాజకీయ పార్టీల కదలికల్లో వే గం పుంజుకుంది. ప్రభుత్వం మొదటగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆశావహులు తెరపైకి వచ్చారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టమవడంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన నేతలతోపాటు కొత్త వారు తమ అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. నాయకులు ఇప్పటికే పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.
జిల్లా వ్యాప్తంగా 280 గ్రామపంచాయతీలు, 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 2,534 వార్డులు, గత ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన వివరాల ప్రకారం 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి పోలింగ్ శాతం మరింత పెరగడానికి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రతి ఓటరు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరుచనున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా, తదితర కార్యక్రమాల్లో వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారదర్శక పోలింగ్ నిర్వహణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్థానిక సమరం జరుగనున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కొందరు సర్పంచ్ ఆశావహులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, మరోవైపు కొత్త అభ్యర్థులు మార్పు అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రజల్లో మంచి పట్టున్న వారి నుంచి యువ అభ్యర్థుల వరకు అందరూ ప్రజా మద్ధతు కోసం సేవా కార్యక్రమాలు చేస్తూ గత కొన్నిరోజులుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. గ్రామ పెద్దలు, సంఘాలు, ప్రభావవంతమైన కుటుంబాలు కూడా ఈ దశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చలి చంపుతున్న వేళ రాజకీయ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి సమావేశం, ప్రతి చర్చ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీలతోపాటు ప్రతిపక్షాలు కూడా తమ బృందాలను గ్రామాల్లోకి దింపి వ్యూహరచనలకు శ్రీకారం చుట్టాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార ప్రణాళికల వరకూ పార్టీలు దశలవారీగా సిద్ధమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల జోష్ కనిసిస్తుంది. పాత రిజర్వేషన్లతో కొత్త సమీకరణలు ఎలా రూపుదిద్దుకుంటాయన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటర్ల నమోదు ప్రక్రియకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
తెరపైకి ఆశావహులు
ఎన్నికల బిజీలో అధికారులు, సిబ్బంది
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపికపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ కరసత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపిక పెద్ద సవాల్‌గా మారనుంది. రెండు పార్టీల్లో మెజార్టీ గ్రామాల్లో ఇద్ద రి నుంచి ముగ్గురు పోటీలో ఉండడంతో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయాపార్టీలు రహస్య సర్వేలు సైతం చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్లు నిర్వహిస్తారనే ప్రచారం నేపథ్యంలో అవకాశం కలిసి వచ్చే వారు సేవా కార్యక్రమాలతో దూసుకుపోగా, బీసీ రిజర్వేషన్లతో నెల రోజులు గ్యాబ్ రాగా, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు.


