పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
జనగామ: పుస్తక పఠనం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, నిర్ణయశక్తి, ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం జిల్లా గ్రంథాలయ ఆవరణలో సంస్థ చైర్మన్ మారడోజు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్‌తో కలిసి డీసీపీ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రంథాలయాలు భవిష్యత్ నిర్మాణంలో ఉత్తమ మార్గదర్శకాలని పేర్కొన్నారు. యువత పుస్తక పఠనం వైపు మొగ్గు చూపాలని సూచించారు. పుస్తకం చదివిన వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, జీవన విధానం సానుకూలంగా మారుతాయని డీసీపీ సూచించారు. ప్రతి ఇంట్లోనూ పఠన సంస్కృతి పెరగాలంటే గ్రంథాలయాల వినియోగం తప్పనిసరి అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువత తప్పనిసరిగా గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారజోడు రాంబాబు మాట్లాడుతూ.. నెట్ ప్రపంచంలో గూగుల్ ద్వారా సమాచారాన్ని వెతకడం కాకుండా నేరుగా గ్రంథాలయాల్లో పుస్తక పఠనం చేసి జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే సమాజానికి దిక్చూచిగా నిలబడతారని అన్నారు. పుస్తక పఠనం ద్వారా ఒకేచోట నుంచే ప్రపంచాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, కళాకారులు,కవులు, రచయితలు లింగాజీ, సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, ఐల సోమాచారి, జోగు అంజయ్య, గ్రంథాలయ సెక్రెటరీ సుధీర్, జయరాం, బాష్మియా, తోటకూర రమేష్, బండ కుమార్, పర్ష సిద్దేశ్వర్, క్రాంతి, శ్రవణ్, పృథ్వీ, నరేందర్, ప్రవీణ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


