కోతులకు ఆహారంగా ఏకుడుపేలాలు, అన్నం..
జఫర్‌గఢ్ : జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన ఓ రైతు తన పంటను కోతుల బారినుంచి కాపాడేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు. గ్రామానికి చెందిన గడ్డం కొమురయ్య తన పదెకరాల భూమిలో వరి సాగు చేశాడు. ప్రస్తుతం చేను బిర్రుపొట్ట దశకు రావడంతో కోతులు పంట చేను మీద పడి నాశనం చేస్తున్నాయి. వీటి బారినుంచి పంటను కాపాడేందుకు సదరు రైతు కొమురయ్య వినూత్న ఆలోచన చేశారు. ప్రతీరోజు ఇంటినుంచి ఎక్కువగా ఏకుడుపేలాలు, అన్నం, కొద్ది మొత్తంలో పల్లీలు తీసుకువచ్చి తన పంట పొలం వద్ద ఉన్న రోడ్డుపై చల్లుతున్నారు. దీంతో కోతులు పంట చేనును వదిలి రోడ్డుపైకి వచ్చి వీటిని తింటున్నాయి. కోతులన్నీ గుంపుగా ఒక చోటుకు చేరగానే వాటిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. దీంతో కోతులు పంట చేను వైపు రావడం లేదంటూ రైతు కొమురయ్య తెలిపాడు. ఈ విధానాన్ని గత కొద్ది రోజులనుంచి పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కోతులు తనను చూడగానే తన మాటలను గుర్తించి దగ్గరకు వస్తున్నాయని, తనపై ఎలాంటి దాడులు కూడా చేయడం లేదని రైతు కొమురయ్య తెలిపారు. ఈ ప్రయోగాన్ని గమనించిన తోటి రైతులతోపాటు రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వాటిబారి నుంచి పంటను కాపాడేందుకు ఓ రైతు వినూత్న యత్నం


