సాగుకు యంత్రసాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ఆధునికీకరించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా సబ్సిడీ యంత్రాల సరఫరా నిలిచిపోగా, ఇప్పుడు రైతులకు ఉత్సాహాన్నిచ్చే విధంగా వ్యవసాయ శాఖకు భారీ మొత్తంలో యంత్రాలను విడుదల చేసింది. జిల్లాకు 3,370 యంత్ర పరికరాలకు ప్రభుత్వం ఆమోదం తెలపగా, వాటి పంపిణీ కోసం రూ.2.73 కోట్ల నిధులు కేటాయించింది. పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, ప్రతీ పరికరం ఏ కంపెనీ ద్వారా అందుబాటులో ఉంటుందో రైతులకు వివరాలు కూడా ప్రకటించారు. రైతుకు అవసరమైన యంత్రంపై సంబంధిత కంపెనీ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌కు అందజేస్తే సరిపోతుంది.
మార్పిడి చేసుకునే అవకాశం
జిల్లాలో యంత్రాల అవసరానికి సంబంధించి డిమాండ్‌ను పరిశీలించి, అవసరమైతే ఇతర పరికరాలకు కేటాయించిన నిధుల నుంచి కన్వర్షనన్ చేసి రైతులు అత్యధికంగా కోరిన వాటిని అందించే అవకాశం కూడా కల్పించారు. సబ్సిడీ పరికరాలను అందించడంతో పాటు జిల్లాలో డిమాండ్ ఆధారంగా యంత్రాల మార్పిడి ద్వారా కూడా వారికి అవసరమైన వాటిని అందించే వెసులుబాటు ఈ స్కీంలో కల్పించారు. అర్హత కలిగిన ప్రతీ రైతుకు సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, అక్కడి నుంచి రాష్ట్రస్థాయికి దరఖాస్తుల పరిశీలన జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు యంత్రాల పంపిణీని 100శాతం పూర్తి చేయాలనే లక్ష్యంగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు తమకు అవసరమైన యంత్రాలను త్వరగా ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసు కోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
రైతులకు ప్రయోజనం
ప్రభుత్వం నుంచి సబ్సిడీ యంత్రాల సరఫరా లేని సమయంలో రైతులు ప్రైవేటుగా 100శాతం ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యంత్రపరికరాల కొనుగోలుపై ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు, మహిళ రైతులకు 50శాతం, జనరల్, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకుంటే, జిల్లాలో ఏ యంత్రానికి డిమాండ్ ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సబ్సిడీ యంత్రాల పంపిణీ ప్రక్రియ ముగించనున్నారు.
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్
సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందజేత
అన్నదాతపై తగ్గనున్న ఆర్థిక భారం
పవర్ టిల్లర్ నుంచి రోటోవేటర్ వరకు
జిల్లాకు 3,370 పరికరాలు.. రూ.2.73కోట్ల బడ్జెట్
జిల్లాకు కేటాయించిన యంత్ర పరికరాల వివరాలు
యంత్రం సంఖ్య మొత్తం
(లక్షల్లో/రూ.)
పవర్ వీడర్స్ 17 5.95
బ్రష్ కట్టర్లు 33 11.55
పవర్ టిల్లర్లు 25 25.00
స్ట్రా బేలర్స్ 19 38.00
స్ప్రేయర్లు 2456 24.56
(బ్యాటరీ/మాన్యువల్)
పవర్ స్ప్రేయర్లు 444 44.40
రోటోవేటర్లు 154 77.00
సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ 25 7.50
డిస్క్ హారో/ఎంబీ ప్లౌ/
కేజ్ వీల్స్/రోటో పడ్లర్ 169 33.80
బండు ఫార్మర్ 6 0.90
పవర్ బండ్ ఫార్మర్ 3 4.50
మొత్తం 3,370 2.73 కోట్లు
రైతులు సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి సర్కారు నుంచి కేటగిరీ వారీగా గైడ్‌లైన్స్ వచ్చాయి. రైతుల డిమాండ్ ఆధారంగా మన వద్ద డిమాండ్ లేని యంత్ర పరికరాలకు కేటాయించిన బడ్జెట్ నుంచి, అన్నదాతలకు ఉపయోగపడే విధంగా అందించే అవకాశం ఉంది. దీనిని రైతులు సద్వినియోగం చేసుకుని, వ్యవసాయ అవసరాలు ఉపయోగించుకోవాలి. యంత్ర పరికరాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యంత్ర పరికరం అవసరమైన రైతులు సంబంధిత కంపెనీపై డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది.
– అంబికా సోని, జిల్లా వ్యవసాయాధికారి
సాగుకు యంత్రసాయం


