మినహాయింపు కొందరికే
జనగామ రూరల్: పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు కొందరికే వర్తిస్తోంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్‌లో వెనకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్పుతూనే వస్తోంది. అయితే అది ఏ ఒక్కరికీ ఉపయోగపడడం లేదు. ప్రభుత్వం ప్రకటించడానికి, అధికారులు చెప్పుకోడానికే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ ఫీజుల చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా 103 ఉన్నత పాఠశాలల్లో 6,695 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాసేందుకు యూడైస్ ప్లస్‌లో నమోదు చేసుకున్నారు. అయితే, ఏటా అక్టోబర్‌లోనే పరీక్ష ఫీజు షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లిమెంటరీ విద్యార్థులు 3 సబ్జెక్టులోపునకు రూ.110, మూడుదాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు 20 నవంబర్ వరకు ఉంది. అదేవిధంగా రూ.50 ఫైన్, రూ.200, రూ.500 అపరాధ రుసుం చెల్లించే గడువు సైతం ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తత్కాల్ పేరుతో రూ.వెయ్యి ఫైన్‌తో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇవ్వగా ఈసారి నోటిఫికేషన్‌లో అలాంటి అవకాశం ఇవ్వలేదు.
మారని నిబంధనలతో ఇబ్బందులు
అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడినవారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24వేల లోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. 30 ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది వెనుకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతోంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే..
ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్సెస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రతిని అందించాం. నిబంధనల ప్రకా రం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలు దాటకూడదు.
– టి. రవికుమార్, అసిస్టెంట్ కమిషనర్ , ప్రభుత్వ పరీక్షల విభాగం
వసతిగృహాల విద్యార్థులకు అవకాశం
ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న బీసీ విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఏటా ఇచ్చే ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలుగుతున్నారు. అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం బాలికలకు ఫీజు రాయితీ వర్తిస్తోంది. ఎస్సీ ఎస్టీ, బీసీ వెల్ఫేర్ గురుకులాలతో పాటు కేజీబీవీ విద్యార్థులు మాత్రమే ఈ రాయితీ నేరుగా పొందుతుండగా, మిగతా విద్యార్థులకు ఈ అవకాశం లభించడంలేదు. వార్షిక ఆదాయ నిబంధన సవరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజులో పాత నిబంధనలు
ఏళ్లతరబడిగా మార్పులేని కుటుంబ ఆదాయపరిమితి
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో చేకూరని లబ్ధి
గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు అవకాశం
మినహాయింపు కొందరికే


