వేతన వెతలు
రెగ్యులరైజ్ చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న 9 నెలల వేతనాన్ని వెంటనే అందించాలి. నెలల తరబడి జీతాలు రాక అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– కొలనుపాక హరిప్రసాద్, కాంటిజెన్సీ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ ఆసుపత్రులలో కాంటిజెన్సీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వేతనాలతో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులు జీతాలు సకాలంలో అందక కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో దాదాపు 600 మందికి పైగా, జనగామ జిల్లాలో 30 మంది వరకు కాంటిజెన్సీ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిసరాలు, వాష్‌రూమ్‌లు శుభ్రం చేయడం, వార్డులలో బెడ్ షీట్‌లను మార్చడం, వార్డులను క్లీనింగ్ చేయడం తదితర పనులను కాంటిజెన్సీ వర్కర్లు చేస్తుంటారు. ఆసుపత్రులకు ప్రధానమైన పరిశుభ్రత పనిని చేసే కాంటిజెన్సీ వర్కర్లు వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉదయం వైద్య సిబ్బంది కన్నా ముందు ఆసుపత్రికి వచ్చి సాయంత్రం వరకు పనిచేసే కార్మికుల వెతలు పాలకులకు పట్టడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లు ఉండే వార్డులతో పాటు వైద్యుల ఉండే గదులను ప్రతీరోజూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసే కాంటిజెన్సీ వర్కర్లపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు.
సమ్మె చేసినా..
కాంటిజెన్సీ వర్కర్లకు నెలకు కేవలం రూ.5,200 వేతనమే అందిస్తారు. ఈ వేతనాన్ని కూడా తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని వర్కర్లు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రతలో కీలకంగా పనిచేసే కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమంటున్నారు. గతంలో వేతనాలు అందించాలని, తమను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు సమ్మె చేసినా పాలకులు స్పందించడం లేదు. సమ్మె సమయంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కాంటిజెన్సీ వర్కర్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంటిజెన్సీ
వర్కర్ల ఇబ్బందులు
9 నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పులు
సకాలంలో వేతనాలు ఇవ్వడంతో పాటు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
ఏళ్లతరబడి ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి. ఆసుపత్రుల పరిశుభ్రత కోసం అహర్నిశలు పనిచేసే కార్మికులకు అందించే అరకొర వేతనాలు నెలల తరబడి అందించకపోవడం బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– కె.అంజయ్య,
సంఘం జిల్లా అధ్యక్షుడు, బచ్చన్నపేట
వేతన వెతలు
వేతన వెతలు


