● పత్తి మిల్లర్ల చర్చలు సఫలం
● ఊపిరిపీల్చుకుంటున్న రైతులు
జనగామ: రాష్ట్రవ్యాప్తంగా పత్తి మిల్లులు, అనుబంధంగా ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు ఈనెల 19న(బుధవారం) తెరుచుకోనున్నాయి. ఎల్–1, ఎల్2, ఎల్3 కేటగిరీల వారీగా సీసీఐ సెంటర్ల ప్రారంభం, ఎకరాకు 12క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు కుదింపు, జిల్లా పరిధి నిబంధన తదితర సమస్యలపై నిరసిస్తూ తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈనెల 17 నుంచి పత్తి మిల్లులు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో జరిపిన చర్చలు సఫలం కావడం, కాటన్ అసోసియేషన్ ప్రతినిధులను ఒప్పించి బంద్‌ను విరమింపజేశారు. జిల్లాలో 15 పత్తి మిల్లులు ఉండగా, ఇందులో 14 చోట్ల సీసీఐ సెంటర్లను ప్రారంభించిన అధికారులు, మ రో చోట పెండింగ్ ఉంచారు. ఇప్పటివరకు 3,427 మంది రైతుల వద్ద 48.750 క్వింటాళ్ల తెల్ల బంగారం కొనుగోలు చేయగా, ఇందుకు సంబంధించి రూ.28.08 కోట్లకు గాను రూ.25కోట్ల మేర వారి ఖాతాలో జమ చేశారు. రైతులు తమ పత్తిని బుధవారం నుంచి సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చని జిల్లా కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ తెలిపారు. పత్తి మిల్లర్లు సమ్మె విరమించుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
సమ్మె విరమించారు
నేటి నుంచి యథావిధిగా సీసీఐ సెంటర్లలో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ సీఎండీతో చర్చలు జరిపి, జిన్నింగ్ మిల్లర్ల సమ్మెను విరమింపజేశారు.
నేటినుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం


