పత్తి ధర ఢమాల్‌! | - | Sakshi
Sakshi News home page

పత్తి ధర ఢమాల్‌!

Nov 18 2025 6:09 AM | Updated on Nov 18 2025 6:15 AM

పత్తి ధర ఢమాల్‌!

సీసీఐ బంద్‌తో

తగ్గిన తెల్లబంగారం ధర

ఏ జిల్లా పత్తి ఆ జిల్లాకే..

జనగామ: పత్తి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. సీసీఐ ద్వారా మద్దతు ధర లభిస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగిలింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే దిగుబడి తగ్గి పంట నష్టపోయిన రైతులను ఇప్పుడు మార్కెట్‌ బంద్‌ వెంటాడుతోంది. పైగా చిల్లర కాంటా వ్యాపారంలో క్వింటాకు రూ.1,800 తక్కువగా చెబుతుండడం, అత్యవసర ఆర్థిక ఒత్తిడికి తట్టుకోలేని రైతులు నష్టపోయినా అమ్మేయాల్సిన దుస్థితి నెలకొంది. కాటన్‌ కార్పొరేషన్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ సంబంధిత మిల్లులు బంద్‌లోకి వెళ్లడంతో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి.

మిల్లుల వద్ద పడిగాపులు

సీసీఐ, పత్తి మిల్లులు బంద్‌ చేశారని తెలియక సెంటర్ల వద్దకు వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. పత్తి మిల్లులకు అనుసంధానంగా ఉన్న సీసీఐ సెంటర్ల వద్ద దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, జనగామ పలు మండలాలకు చెందిన రైతులు పత్తిని అమ్ముకునేందుకు వచ్చి నిరీక్షిస్తున్నారు. బంద్‌ చేపట్టారని తమకు ఎవరూ చెప్ప లేదని అంటున్నారు. బంద్‌ నేపధ్యంలో సీసీఐ సెంటర్లను సాక్షి పరిశీలన చేయగా, రైతుల కష్టాలు వెలుగు చూశాయి.

నిబంధనల్లో కఠినతరం

వానాకాలం సీజన్‌లో సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు ఆశని పాతంలా మారిపోయింది. గతంలో రైతు వారిగా ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సెంటర్లు, ఇప్పుడు 7 క్వింటాళ్లకు తగ్గించారు. అంతే కాకుండా ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3 పేరిట పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ కేంద్రాలను ప్రారంభించే కొత్త నిబంధన తీసుకువచ్చారు. ఈ మార్పులతో రైతులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చిల్లర కాంటా దోపిడీ

సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోవడంతో, ఇంటింటా తిరిగి తీసుకెళ్లడం, రవాణా ఖర్చులు, అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, ఎరువుల కొనుగోళ్లు వంటి కారణాలతో రైతులు అంతగా ఇష్టపడకపోయినా చిల్లర కాంటాలో ప్రైవేట్‌ వ్యాపారులకే పత్తిని అమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. జనగామ పట్టణం, నెల్లుట్ల, తరిగొప్పుల, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, స్టేషన్‌న్‌ఘన్‌పూర్‌ తదితర మండలాల్లో చిల్లర కాంటా జోరు స్పష్టంగా కనిపిస్తోంది. పాలక ప్రభుత్వాలు సీసీఐ మిల్లుల బంద్‌ను వీలైనంత త్వరగా ఎత్తివేసి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

గ్రామాల్లో జోరుగా

చిల్లర వ్యాపారుల దందా

ఆర్థిక పరిస్థితులు, యాసంగి పెట్టుబడి కోసం అమ్ముకుంటున్న రైతులు

క్వింటాకు రూ.1,800 తగ్గించి

కొనుగోలు చేస్తున్న వైనం

సీసీఐ సెంటర్లలో మాతృ జిల్లాకు సంబంధించిన పత్తి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన విధించింది. దీంతో సరిహద్దు గ్రామాల రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలు, రెవెన్యూ పరిధి జనగామ జిల్లాకు పక్కనే ఉంటుంది. ఇతర జిల్లాల రైతులకు సీసీఐ సెంటర్లు సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ పత్తి అమ్ముకునే వీలు లేకుండా పోతుంది. సొంత జిల్లాలో అమ్ముకుందామంటే రవాణా చార్జీలు పెరిగి పోతున్నాయి. దీంతో రైతులు పలుమార్లు ప్రయాణించాల్సి రావడంతో రవాణా వ్యయాలే భారం మారుతున్నాయి. రైతుల కష్టాలు, మిల్లర్ల వినతులను దృష్టిలో ఉంచుకుని సమీప జిల్లాల పత్తిని సైతం కొనుగోలు చేయాలని తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది.

పత్తి ధర ఢమాల్‌!1
1/3

పత్తి ధర ఢమాల్‌!

పత్తి ధర ఢమాల్‌!2
2/3

పత్తి ధర ఢమాల్‌!

పత్తి ధర ఢమాల్‌!3
3/3

పత్తి ధర ఢమాల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement