రక్షణలేని చెరువులు
స్టేషన్‌ఘన్‌పూర్: చెరువుల అభివృద్ధి నిర్వహణ, నీటిసరఫరా కోసం పనిచేసే సాగునీటి సంఘాలు లేక జిల్లా వ్యాప్తంగా చెరువుల పర్యవేక్షణ కొరవడింది. గత పదిహేడు ఏళ్లుగా సాగునీటి సంఘాలు లేక పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా వ్యాప్తంగా 770 చెరువులు ఉండగా 153 చెరువులకు గతంలో సాగునీటి సంఘాలు ఉండేవి. మొత్తం చెరువులలో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులకు మాత్రమే సాగునీటి సంఘాలు ఉంటాయి. సాగునీటి సంఘాల ఎన్నికలకు ఆయా చెరువుల కింద వ్యవసాయభూములు ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులు ఓటర్లుగా ఉంటారు. ఒక సాగునీటి సంఘానికి ఆరుగురు డైరెక్టర్లు, ఒక చైర్మన్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయగానే ఎన్నికలు నిర్వహించేవారు. ఆయా చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. చైర్మన్, పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంటపొలాలకు సీజన్‌ల వారీగా విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేవారు. అదేవిధంగా రైతులను సమన్వయం చేసుకుంటూ పలు అభివృద్ధి పనులు నిర్వహించేవారు.
జాడలేని నీటిసంఘాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించింది. వాటి పదవీకాలం 2008తో ముగియగా అప్పటి నుంచి సాగునీటి సంఘాల ఊసేలేదు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధి అంటూ మిషన్ కాకతీయ పనులతో చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టిందేగాని సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయలేదు. నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తూతూమంత్రంగా పనులు చేపట్టారు. పలుచోట్ల చెరువుల భూములు అన్యాక్రాంతమైన సంఘటనలు సైతం ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాలించిన బీఆర్‌ఎస్ పాలకులు సాగునీటి సంఘాల మాటే ఎత్తలేదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తయిన నీటి సంఘాల ఎన్నికలు తిరిగి పదేళ్లకు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించి చెరువులను రక్షించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
సాగునీటి సంఘాలు లేక పర్యవేక్షణ కరువు
బాధ్యులు లేకపోవడంతో ఆక్రమణలు
నీటి నిర్వహణ అస్తవ్యస్తం
17ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించని ప్రభుత్వాలు


