ఆలస్యంగా చెరువుల్లోకి చేప
జిల్లాలో మత్స్యకారుల వివరాలు
నత్తనడకన సాగుతున్న చేపపిల్లల పంపిణీ
జనగామ రూరల్: మత్య్స కారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం రాయితీతో చేపపిల్లల పంపిణీకి సిద్ధమైంది. గతేడాది కంటే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ఆలస్యమైనా ఎట్టకేలకు చెరువుల్లోకి చేప పిల్లలు చేరుతున్నాయి. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వానాకాలం మొదట్లో ప్రారంభించాల్సి ఉండగా నవంబర్‌లో చెరువుల్లో చేపలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 736 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో రెండున్నర కోట్ల చేప పిల్లలు విడుదల చేయాలని కార్యాచరణ రూపొందించి 10 రోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఇప్పటివరకు 4లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో కొర్రలు, బంగారు తీగ వంటి పలు రకాల చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈసారి చేపపిల్లలు ఆలస్యంగా రావడం వల్ల మత్స్యకారుల్లో కాస్త ఆందోళన నెలకొన్నప్పటికీ చేప పిల్లల పంపిణీ మొదలుకావడంతో వారిలో ఆశలు చిగురించాయి.
చేపపిల్లల పంపిణీపై మే నెలలో కాంట్రాక్టర్లను పిలిచి టెండర్లు పూర్తి చేసి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపల పంపిణీకి సిద్ధం కావాలి. గతేడాది 50 శాతం మాత్రమే లక్ష్యం చేరారు. ఈఏడాది కూడా చేపల పంపిణీపై సందిగ్ధం ఉండగా నవంబర్ నెలలో చేపల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో చేపల సైజు తక్కువగా ఉండి.. ఈ నెలలో వేస్తే సరిగా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌లో మాత్రమే చేపల పంపిణీ ప్రారంభించగా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదు.
చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేయడం వల్ల మత్స్యకారులకు ఊరట లభించింది. గతేడాది అరకొర చేప పిల్లలతో లక్ష్యం చేరకుండా ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి అయిన చేతిలో ఉంటుందని ఆశపడుతున్నారు. చేపల పంపిణీ వల్ల అదనంగా వృత్తిపై ఆధారపడి జీవించేవారికి ఉపాధి లభించనుంది. చెరువుల్లో జీవన సంపద మెరుగుపడి నీటి నాణ్యత కూడా నిలకడగా ఉంటుంది. జిల్లాలో మత్స్యకారులతోపాటు మహిళలు కూడా చేపల అమ్మకాలపై దృష్టి పెట్టనున్నారు. సొసైటీల డైరెక్టర్‌లు, సభ్యులు చేపల పంపిణీలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా నీరు ఉండడంతో ఎక్కువ మొత్తంలో చేపల ఉత్పత్తి జరగనుంది.
జిల్లాలో మత్స్యసొసైటీల సంఖ్య –190
మత్స్యకారుల సంఖ్య –18,577
జిల్లాలో చెరువులు సంఖ్య–727
రిజర్వాయర్‌ల సంఖ్య –9
మొత్తం చేపపిల్లల సంఖ్య–272.27 లక్షలు
ఇప్పటి వరకు వదిలిన చేపపిల్లల సంఖ్య
4 లక్షలు
మొత్తం బడ్జెట్ రూ.3.25 కోట్లు కేటాయింపు
రిజర్వాయర్‌లకు రూ.1.44 కోట్లు కేటాయింపు
చెరువులకు రూ.1.29 కోట్లు కేటాయింపు
736 రిజర్వాయర్, చెరువుల్లోకి 272.27 లక్షల చేపపిల్లలు
ఇప్పటివరకు 4 లక్షలు పంపిణీ
వచ్చే నెల చివరి నాటికి పూర్తయ్యేలా చర్యలు
పాలకుర్తిలో ఇంకా
ప్రారంభంకాని పంపిణీ
ఆలస్యంగా చెరువుల్లోకి చేప


